యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ఈ రోజు తెల్లవారు ఝామునుంచే ప్రపంచ వ్యాప్తంగా స్క్రీనింగ్ అయ్యింది. ఎక్కడికక్కడ నందమూరి అభిమానులు రాత్రంతా మేల్కొని మరీ థియేటర్ల వద్ద సందడి చేశారు. ఏపీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బెనిఫిట్ షోలు లేవు.
అయితే హైదరాబాద్‌లో కేసీఆర్ సర్కార్ మాత్రం అఖండ బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇచ్చింది. దీంతో డిసెంబర్ 2వ తేదీ తెల్లవారు ఝామునుంచే హైదరాబాద్‌లోని నిజాంపేట క్రాస్ రోడ్స్‌లో ఉన్న భ్రమరాంబ, మల్లిఖార్జున్ థియేటర్లలో బెనిఫిట్ షో వేశారు.
ఇక బెనిఫిట్ షోలకు టిక్కెట్ రేట్లు ఎలా ఉంటాయో తెలిసిందే. అందులోనూ హైదరాబాద్‌లో అంటే రేట్లు అదిరిపోవాల్సిందే. మామూలుగా భ్రమరాంబలో టిక్కెట్ రేట్లు రు.2 వేల వరకు ఉంటాయి. అయితే అఖండకు మాత్రం ఏకంగా రు. 3500 టిక్కెట్ రేటు పెడితే హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. నందమూరి అభిమానులు మాత్రం టిక్కెట్ రేటు ఎంత ఉన్నా తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ చూసేయాలని తగ్గేదేలే అంటున్నారు.
ఈ షో చూసేందుకు ఆంధ్రా నుంచి 350 బస్సుల్లో అభిమానులు హైదరాబాద్‌కు వచ్చారంటే బాలయ్యకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది. ఇక నిన్న సాయంత్రం నుంచే ఈ జంట థియేటర్లలో నానా రచ్చ షురూ అయ్యింది. బాలయ్య కటౌట్లను భారీ ఎత్తున ఏర్పాటు చేసి మరీ బాలయ్యపై తమకు ఉన్న అనంత అభిమానం చాటుకున్నారు.