తెలుగు సినిమా రంగంలో గత నాలుగు దశాబ్దాల్లో ఎంతో మంది హీరోలు వచ్చారు… ఎంతో టాలెంట్ ఉన్న కూడా కొందరు మాత్రమే స్టార్ హీరోలు కాగలిగారు. మరికొందరు ఎంతో టాలెంట్ ఉండి కూడా స్టార్ హీరోలు కాలేకపోయారు. ఈ లిస్టులో సీనియర్ హీరో సుమన్ కూడా ఒకరు. సుమన్ మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి కోలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన తల్లి ఒక కాలేజీ ప్రొఫెసర్. ఆయన తండ్రి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో చిన్న ఉద్యోగిగా జీవితం ప్రారంభించి జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. సుమన్ పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోనే..!
కోలీవుడ్లో తొలిసారిగా సినిమాల్లోకి వచ్చిన సుమన్ ఆ తర్వాత తన ప్రాణ స్నేహితుడు భానుచందర్ కోరిక మేరకు తెలుగు సినిమాల్లో నటించారు. తరంగిణి తెలుగులో సుమన్‌కు మంచి పేరు తీసుకువచ్చింది. సుమన్ తన కెరీర్‌లో మొత్తం తొమ్మిది భాషల్లో నటించారు. సుమన్ తెలుగులో ఒక టైంలో వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోయారు. ఆ టైంలో ఆయన స్టార్ హీరోలకే చెమటలు పట్టించారు.
అలాంటి సమయంలో సుమన్ ఒక కేసులో ఇరుక్కుని జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది. దీంతో సుమన్ జీవితం ఒక్కసారిగా తలకిందులు అయిపోయింది. సుమన్ తిరిగి సినిమాల్లోకి వచ్చినా ఆయనకు హీరోగా మంచి ఛాన్సులు కరువయ్యాయి. ఇండస్ట్రీలోని కొందరు కావాలనే సుమన్‌ను ఈ కేసులో ఇరికించారని ప్రచారం కూడా గట్టిగా వినిపించింది. పక్కా ప్లాన్‌తోనే సుమన్‌ను ఈ కేసులో ఇరికించారని ఇండస్ట్రీలోనే కొందరు చెప్పుకున్నారు.
అప్పటినుంచి ఆ స్టార్ హీరోలతో సుమన్ దూరంగా ఉంటూ వచ్చారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక వాళ్ళు ఈ కేసులో ఇరికించారని కూడా చాలాసార్లు సుమన్ వాపోయారు. ఆ తర్వాత సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో మంచి పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. మొత్తం అన్ని భాషల్లోనూ కలిసి సుమన్ 500 కు పైగా సినిమాల్లో నటించారు. సుమన్ ప్రఖ్యాత రచయిత డి.వి.నరసరాజు గారి మనవరాలు ని వివాహం చేసుకున్నారు.