టాలీవుడ్‌లో సీనియర్ హీరోలలో ఒకరు అయిన యువరత్న నందమూరి బాలకృష్ణ తన ఏజ్‌కు తగిన పాత్రలు ఎంచుకుంటూ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. అఖండ సినిమా డిసెంబర్లో రిలీజ్ అవుతోంది. ఆ వెంటనే మలినేని గోపీచంద్ సినిమాను పట్టాలెక్కించేస్తున్నాడు. ఇక తన తండ్రి నటరత్న ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన బాలయ్య తండ్రి బాటలోనే పౌరాణికంతో పాటు సాంఘీక కథాంశం ఉన్న సినిమాల్లో కూడా నటించారు.
అలాగే గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న కథలో కూడా నటించి హిట్ కొట్టడం బాలయ్యకే చెల్లింది. తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి బాలయ్య 12 సినిమాలలో నటించాడు. ఇందులో ఎన్టీఆర్ డైరెక్ట్ చేసినవే 7 సినిమాలు ఉన్నాయి. అలాగే బాలయ్య తన తండ్రి టైటిల్స్‌తో వచ్చిన సినిమా టైటిల్స్‌తో తాను మరోసారి సినిమాలు చేశాడు. ఇలా చేసిన వాటిలో మెజార్టీ సినిమాలు మంచి ప్రేక్షకాదారణ సొంతం చేసుకున్నాయి.
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా 1969లో భలే తమ్ముడు సినిమా వచ్చి హిట్ అయ్యింది. అయితే 1985లో బాలయ్య అదే టైటిల్‌తో మరోసారి సినిమా చేసి హిట్ కొట్టారు. ఊర్వశి ఈ సినిమాలో హీరోయిన్. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా కథానాయకుడు టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది. ఆ తర్వాత బాలయ్య హీరోగా మరోసారి ఎన్టీఆర్ బయోపిక్ కథాంశంగా కథానాయకుడు సినిమా వచ్చింది. ఇక నిప్పులాంటి మనిషి టైటిల్‌తో బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ సినిమాలు చేశారు.
ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమా సీతారమ కళ్యాణం సినిమాను బాలయ్య తన సినిమా టైటిల్‌గా వాడుకున్నారు. రజనీ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇక దేశోద్ధారకుడు సినిమా టైటిల్‌తో ముందు ఎన్టీఆర్ ఆ తర్వాత బాలయ్య ఇద్దరూ సినిమాలు చేశారు. ఇక దిగ్గజ బ్యానర్ అయిన ఏవీఎం సంస్థ ఎన్టీఆర్‌తో రాము సినిమా తెరకెక్కిస్తే.. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్ కూడా బాలయ్య హీరోగా రాము సినిమా తీసింది.
ఇక సురేష్ బ్యానర్లో ఎన్టీఆర్ హీరోగా రాముడు – భీముడు సినిమా వచ్చింది. బాలయ్య కూడా అదే టైటిల్‌తో సినిమా చేశాడు. ఇలా ఎన్టీఆర్ నటించిన ఏడు సినిమాల టైటిల్స్‌తో బాలయ్య కూడా సినిమాలు చేశాడు.