ఏపీ అసెంబ్లీలో నిన్న జరిగిన పరిణామంపై ఏపీ రాజకీయాలు అట్టుడుకి పోతున్నాయి. చంద్రబాబు తన భార్య భువనేశ్వరి పేరు వైసీపీ వాళ్లు ప్రస్తావించడంతో పాటు లోకేష్ పుట్టుకను కూడా అవమానించేలా మాట్లాడడంతో తట్టుకోలేకపోయారు. తాను మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని సవాల్ చేసి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ప్రెస్మీట్లో మాట్లాడుతూ గుక్కపట్టి ఏడ్చేశారు. చంద్రబాబు వయసుకు కూడా వైసీపీ గౌరవం ఇవ్వలేదని పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరు విమర్శలు చేస్తున్నారు.
నందమూరి ఆడపడుచును అవమానిస్తారా ? అంటూ నందమూరి అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు ఎక్కడికక్కడ గర్జిస్తున్నాయి. నిరసనలు తీవ్రతరం చేస్తున్నాయి. ఈ రోజు నందమూరి ఫ్యామిలీ అంతా కలిసికట్టుగా ప్రెస్మీట్ పెట్టి మరీ తాము చేతులు ముడుచుకుని కూర్చోలేదని.. నందమూరి ఆడపడుచును అంటే ఊరుకోమని వైసీపీకి, ఆ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చాయి.
అయితే ఇదే విషయంపై తారక్ ఫేస్బుక్లో ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. 2.18 నిమిషాలు ఉన్న ఈ వీడియోలో తారక్ ఎవ్వరి పేరూ ప్రస్తావించకుండా హుందాగా స్పందించారు. అసెంబ్లీలో జరిగిన ఘటన తనను ఎంతో కలిచి వేసిందని ఎమోషనల్ అయ్యారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం అని.. అయితే అవి ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా ఉండాలని.. అవి వ్యక్తిగత దూషణలగాను, వ్యక్తిగత విమర్శలగాను ఉండకూడదని తారక్ చెప్పారు.
మనం ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి, వ్యక్తిగత దూషణలకు దిగడం, ఆడపడుచుల గురించి పరుష దూషణలకు దిగడం అది అరాచక పరిపాలనకు నాంది పలుకుతుందని తారక్ ఆవేదనతో, గద్గత స్వరంతో చెప్పారు. ఆడవాళ్లను, ఆడపడుచులను గౌరవించడం అనేది మన సంస్కృతి అని, మన నవనాడులు, మన రక్తంలో ఆ సంస్కృతి ఉందన్నారు.
మన సంస్కృతిని రాబోయే తరాలకు భద్రంగా అప్పజెప్పాలే కాని.. దానిని కాల్చేసి.. రాబోయే తరాలకు మనం బంగారు బాటలు వేస్తున్నాం అనుకుంటే అది మనం చేసే చాలా పెద్ద తప్పు అని తారక్ చెప్పారు. ఈ మాటలు తాను ఈ దూషణకు గురైన కుటుంబ సభ్యుడిగా మాట్లాడడం లేదని. ఓ కొడుకుగా. ఓ భర్తగా, ఈ దేశానికి ఓ పౌరుడిగా, సాటి తెలుగువాడిగా చెపుతున్నానని చెప్పారు. ఏదేమైనా తారక్ ఈ విషయంలో చాలా హుందాగా స్పందించడం ప్రశంసనీయం.