తెలుగు సినిమా రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్ అప్పుడప్పుడే క్రేజ్ తెచ్చుకుంటున్నారు. స్టూడెంట్ నెంబర్ వన్, ఆది సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అది 2002 జూలై నెల. ఆది తర్వాత ఎన్టీఆర్ సీనియర్ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో అల్లరి రాముడు సినిమా చేస్తున్నారు. రిలీజ్ డేట్ జూలై 18. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పరంగా సందిగ్ధంలో ఉన్నారు. మృగరాజు, మంజునాథ ప్లాప్. డాడీ యావరేజ్. ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ కొట్టాలన్న కసితో ఇంద్ర సినిమా చేస్తున్నారు. రిలీజ్‌డేట్ జూలై 24.
అల్లరి రాముడుకు, ఇంద్రకు రిలీజ్‌కు మధ్య వారం రోజుల గ్యాప్ కూడా లేదు. రెండు సినిమాలకు ఒకే దర్శకుడు. పైగా రెండు సినిమాల్లో ఆర్తీ అగర్వాల్ హీరోయిన్. ఎన్టీఆర్ వరుస హిట్లతో ఉండడం.. పైగా ఆది తర్వాత వస్తోన్న సినిమా కావడంతో భారీ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఇంద్ర సినిమాకు కూడా ముందే హైప్ వచ్చింది. చిరు నటిస్తోన్న ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా కావడం.. నిర్మాత అశ్వనీదత్ కావడంతో ఈ సినిమాను కూడా భారీ రేట్లకే కొన్నారు.
ఈ రెండు సినిమాల నెల రోజులకు ముందు అప్పట్లో ఇండస్ట్రీ తో పాటు బయట సినీ అభిమానుల్లో తీవ్రమైన ఉత్కంఠ ఉండేది. నందమూరి, మెగా అభిమానుల మధ్య తమ సినిమాయే పై చేయి సాధిస్తుందంటూ ఒక్కటే చర్చలు నడిచేవి. అయితే ఇంద్ర బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యి… ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది.
అల్లరి రాముడు అంచనాలకు కాస్త తగ్గినా ఎన్టీఆర్‌లో ఉన్న మరో కోణాన్ని ఆవిష్కరింప జేసింది. అయితే అల్లరి రాముడుకు పెట్టిన పెట్టుబడితో పోలిస్తే డబుల్ లాభాలు వచ్చాయని.. ఆ సినిమా నిర్మాత చంటి అడ్డాల పలుసార్లు చెప్పారు. అలా ఆ టైంలో చిరు వర్సెస్ ఎన్టీఆర్ సినిమాల పోటీతో ఇండస్ట్రీలో పెద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది.