తెలుగు తెరపై ఎంత మంది హీరోయిన్లు వచ్చినా మహానటి సావిత్రికి ఉన్న క్రేజ్ వేరు. తెలుగు సినీ అభిమానుల్లో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు. ఆమె జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అయితే ఆమె కెరీర్ చివరి దశలో మాత్రం ఆమె మరణించిన తీరు ఎందరినో కలచి వేసింది. సావిత్రి ఎంత స్టార్ హీరోయిన్ అయ్యిందో… ఎంత ఉచ్ఛ స్థితి చూసిందో తెలిసిందే.
1960వ దశకంలోనే ఆమె లక్షలాది రూపాయలు కూడబెట్టేసిందట. అప్పట్లో ఒక్కో సినిమాకు ఆమెకే టాప్ రెమ్యునరేషన్. అప్పటికి సౌత్‌లో ఆమెను రెమ్యునరేషన్ పరంగా బీట్ చేసే హీరోయిన్లు లేరు. చాలా రోజుల తర్వాత మహానటి బయోపిక్ ద్వారా సావిత్రి మరోసారి అందరి నోళ్లలో బాగా నానారు. సావిత్రి అన్నపూర్ణ బ్యానర్లో చదువుకున్న అమ్మాయిలు సినిమా చేసింది.
ఈ సినిమా వచ్చింది 1963లో.. ఆ సమయంలో సావిత్రి ఓ అసిస్టెంట్ దర్శకుడి చేతిలో రు. 50 వేలు పెట్టి నేషనల్ ప్రైజ్ బాండ్స్ కొనమని చెప్పి వెళ్లిపోయిందట. ఆ రు. 50 వేలు తన దగ్గర ఉండే సరికి ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌కు రాత్రంతా నిద్ర పట్టలేదట. వాటిని బీరువాలో అలాగే భద్రపరిచి ఎప్పుడు తెల్లారుతుందా ? అని వెయిట్ చేశాడట.
తెల్లారేసరికి ఆ డబ్బును బాండ్స్ రూపంలోకి మార్చి తీసుకువెళ్లి సావిత్రికి ఇచ్చేశాడట. సావిత్రి కనీసం ఆ బాండ్లను లెక్క పెట్టుకోలేదట. అవి చూసుకోండని అసిస్టెంట్ డైరెక్టర్ చెపితే.. నీ మీద అంత నమ్మకం లేకపోతే అంత డబ్బు ఎందుకు ఇస్తానని చెప్పిందట. అప్పట్లోనే సావిత్రి ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌కు రు. 50 వేలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లోనే ఆమెకు ఖరీదైన బంగారు ఆభరణాలు, ప్లాట్లు ఉండేవని చెపుతారు.