సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఈ రంగుల ప్రపంచంలో పైకి కనిపించే రంగులే కాకుండా తెరవెనక ఎన్నో బాధలు ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చాక ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవడంతో పాటు ఎన్నో మోసాలను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ తరం అమ్మాయిలు ప్రతి ఒక్కరు అలనాటి అందాల తార సిల్క్ స్మిత జీవితం గురించి తప్పక తెలుసుకోవాలి.
తక్కువ సమయంలోనే ఆమెకు వచ్చిన క్రేజ్.. ఆ తర్వాత ఆమె అందరిని నమ్మి ఎలా సర్వస్వ్యం కోల్పోయిందో చివరకు ఆమె జీవితం ఎలా విషాదంగా ముగిసిందో ? అన్నది తెలిసిందే. సిల్క్ 36 ఏళ్ల వయస్సులోనే తన రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సిల్క్ జీవితం విషయానికి వస్తే ఆమెది ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వలి. ఏలూరుకు సమీపంలో ఉంటుంది. ఆమె అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి.
ఆమె చదువుకోకపోయినా సినిమాల మీద ఆసక్తితో పెద్దమ్మ అన్నపూర్ణమ్మతో కలిసి చెన్నై వెళ్లింది. అక్కడ ఆమెకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు. అయితే ఓ హీరోయిన్‌కు మేకప్ వేసే పనికి కుదిరింది. అక్కడ ఆమెను చూసిన ఓ తమిళ్ డైరెక్టర్ ఆమెకు చిన్న ఛాన్స్ ఇచ్చి ఆమె పేరును సిల్క్ స్మితగా మార్చారు. అక్కడ నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోకుండా దూసుకుపోయారు. ఆమెకు అతి తక్కువ టైంలోనే డబ్బు, హోదా, పేరు అన్ని వచ్చేశాయి.
అయితే ఆ మైకంలో ఆమె చుట్టూ ఎంతో మంది మోసగాళ్లు, వాడుకునే వాళ్లు చేరినా ఆమె వాళ్లను పూర్తిగా నమ్మేసింది. పెద్దమ్మ అన్నపూర్ణమ్మ ఆమెకు చెప్పేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అవేవి సిల్క్ చెవికి ఎక్కలేదు. చివరకు సిల్క్ మరీ కళ్లు మూసుకుపోయి.. అప్పటికే పెళ్లయ్యి పిల్లలున్న అతడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతడు మోసం చేసి సిల్క్‌ను నమ్మించి ఆమె ఆస్తి అంతా కాజేశాడు.
సర్వం కోల్పోయిన సిల్క్ చివరకు అన్నపూర్ణమ్మ వద్దకు వచ్చి భోరుమని విలపించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరకు ఆమె చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. పెద్దమ్మ అన్నపూర్ణమ్మని ఊరికి వెళ్లి రమ్మని ఆమె రూంలో ఆత్మహత్య చేసుకుంది. చివరకు ఆమె చనిపోయిన రోజు మృతదేహం పక్కన ఉన్నది కూడా పెద్దమ్మ అన్నపూర్ణమ్మ మాత్రమే..!