టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్- పాకిస్తాన్‌ల మధ్య జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులకే కాదు యావత్ క్రీడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ అంటేనే అదో థ్రిల్. దాయాదిపై సమరం ఓ సూపర్ ఎన్‌కౌంటర్‌లా ఉంటుంది. ఇక క్రికెట్ ప్రేక్షకులు టీవీలకే హత్తుకుపోతారు. ఇప్పటి వరకూ ప్రపంచకప్ టోర్నీల్లో ఒక్కసారి కూడా పాక్ చేతిలో భారత్ ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పాక్ జట్టు కసిగా ఉంది. గెలుపును ఫ్యాన్స్ తమ దేశ ప్రతిష్టగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
అయితే , ఇప్పటివరకు టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా, పాకిస్థాన్ జట్లు అయిదుసార్లు తలపడ్డాయి. ఆ అయిదు మ్యాచుల్లో ఇండియాదే పైచేయి. మినీ ఫార్మాట్ వరల్డ్‌కప్‌లో పొరుగు దేశం పాకిస్థాన్‌పై ఇండియా ఇప్పటి వరకు ఓడిపోలేదు. పవర్‌ఫుల్ షాట్లతో ప్రేక్షకుల్ని అలరించే ఈ ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై ఇండియానే తన ఆధిపత్యాన్ని చాటింది. 2007లో రెండుసార్లు మ్యాచ్ జరగ్గా… తొలి మ్యాచ్ ‘టై’గా ముగిసింది. అయితే ‘బౌల్ అవుట్’లో భారత్ గెలుపొందింది.
ఆ తర్వాత ఫైనల్లో 5 పరుగులతో నెగ్గిన ధోని సేన చాంపియన్‌గా నిలిచింది. గత మూడు ప్రపంచకప్‌లలో భారత్ ఏకపక్ష విజయాలు (8 వికెట్లతో, 7 వికెట్లతో, 6 వికెట్లతో) సాధించింది. ఈ మూడు మ్యాచ్‌లలో విరాట్ కోహ్లి ఒక్కసారి కూడా అవుట్ కాకపోవడం (78 నాటౌట్, 36 నాటౌట్, 55 నాటౌట్) విశేషం. కాగా… భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లోని ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని సామాజిక మాధ్యమాలతో పాటు రాజకీయ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (భ్ఛ్ఛీ) కీలక ప్రకటన చేసింది. ఇదే విషయమై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రసంస్థలపై కఠినంగా చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.