మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ – ప్రస్థానం ఫేమ్ దేవ కట్టా కాంబినేషన్లో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్. సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యి హాస్పటల్లో ఉండడంతో ఈ సినిమాను మెగా ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ కలిసి మరీ ప్రమోట్ చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాను చూసి బాగుందని మెచ్చుకున్నారు.
అయితే పొలిటికల్ నేపథ్యం కావడంతో పాటు సీరియస్‌గా నడిచే సినిమా కావడంతో ఫ్యామిలీ, యూత్ ప్రేక్షకులకు రీచ్ కాలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా ఈ సినిమా నష్టాల్లో ముగియడం ఖాయంగా కనిపిస్తోంది. ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న రిపబ్లిక్ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీక్ ముగిసే సరికి కేవలం రు 6.73 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాకు రు. 12 కోట్లకు పై గా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సాయితేజ్ సోలో బ్రతుకే సో బెటర్ కూడా రు. 35 కోట్ల షేర్ రాబట్టింది. మరి ఆ సినిమాతో పోలిస్తే రిపబ్లిక్ ఆరో వంతు వసూళ్లు కూడా రాబట్టుకోలేకపోయింది.
ఇక రిపబ్లిక్ ఏరియా వైజ్ వసూళ్లు చూస్తే నైజాంలో 2.10 కోట్లు – సీడెడ్ 1.11 కోట్లు – వైజాగ్ 76 లక్షలు – ఈస్ట్ & వెస్ట్ 88 లక్షలు – కృష్ణ 41 లక్షలు – గుంటూరు 47 లక్షలు – నెల్లూరు 28 లక్షలు – రెస్టాఫ్ ఇండియాలో 72 లక్షలు వసూలు చేసింది. రెండో వారంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్పా రిపబ్లిక్ సినిమా కొన్నవారికి భారీ నష్టాలు తప్పవు.