సినిమా అంటేనే కోట్లతో జూదం. సినిమా హిట్ అయితేనే అక్కడ అందరూ సేఫ్ అవుతారు. సినిమా ప్లాప్ అయితే హీరో, నిర్మాత, దర్శకుడు ఇలా అందరి కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్స్‌లో పడిపోతుంది. ఎంతో కష్టపడి ఏళ్ల పాటు సినిమాను తెరకెక్కిస్తే ప్రేక్షకుల దేవుళ్లే దానికి అంతిమ తీర్పు ఇస్తారు. ఇక కరోనా రెండు దశల తర్వాత ఏ సినిమా అయినా ఎప్పుడు విడుదల అవుతుందో ? ఎంత ఖర్చు పెడితే ఎంత వస్తుందో ? కూడా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.
ఇక తెలుగు సినిమాపై మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఏపీలో టిక్కెట్ల రేట్లు తగ్గించేశారు. పైగా టిక్కెట్లను ఆన్‌లైన్ టిక్కెటింగ్‌గా మార్చేశారు. దీంతో భారీ వసూళ్లకు అవకాశం లేదు. దీంతో కరోనాకు ముందు ఏపీలో సినిమాలకు జరిగిన బిజినెస్‌లకు ఇప్పుడు జరుగుతోన్న బిజినెస్‌కు మధ్య 30 శాతం లాస్ అవుతున్నారు. ఏపీలో సినిమాల బిజినెస్‌లు అన్నీ రివైజ్ చేసి 30 % తగ్గింపు రేట్లకు అమ్ముతున్నారు.
ఇదిలా ఉంటే ప్రభాస్ రాధే శ్యామ్‌పై ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో తేడా కొడుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను దర్శకుడు సుధీర్ఘకంగా సాగదీసుకుంటూ వచ్చారు. దీనికి తోడు కరోనా దెబ్బ ఇవన్నీ కలిసి సినిమా వడ్డీలకే రు. 60 కోట్లు అయినట్టు తెలుస్తోంది. సినిమాకు కూడా ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయ్యిందంటున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయితే తప్పా ప్రభాస్‌తో పాటు నిర్మాతలు గట్టెక్కడం కష్టం అన్న మాట వినిపిస్తోంది. వచ్చే సంక్రాంతి కానుకగా రాధే శ్యామ్ రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.