తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. వాస్తవంగా రెండు గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉంది. అయితే క్యూలో ఇంకా ఓటు వేసేందుకు ఎక్కువ మంది ఉండడంతో ఇరు ఫ్యానెల్స్ కోరిక మేరకు పోలింగ్ సమయాన్ని మరో గంట పాటు అదనంగా 3 గంటల వరకు పొడిగించారు. అయితే ఎప్పుడూ లేనంతగా ఈ సారి మా ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయ్యింది.
2019 ఎన్నికల్లో 474 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ఇప్పటికే 550 ఓట్లు పోలవ్వగా.. పోలింగ్ ముగిసే సరికి ఇది 700 క్రాస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మా హిస్టరీలోనే ఇది రికార్డుగా మిగిలి పోనుంది.
ఇక ఈ సారి పోస్టల్ బ్యాలెట్లు కూడా గెలుపు ఓటములను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఇక మా ఎన్నికల్లో ఓటు వేసేందుకు చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి పలువురు సీనియర్ నటులు కూడా ఇక్కడకు వచ్చారు. జయప్రద అయితే ఢిల్లీ నుంచి వచ్చి మరీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జెనీలియా ముంబై నుంచి, మాలా శ్రీ బెంగళూరు నుంచి వచ్చారు.
ఇక సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే పోలింగ్ లేట్ అవ్వడంతో అర్ధ రాత్రి దాటాక ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముందుగా ఈసీ మెంబర్ల ఎన్నిక కు సంబంధించి ఫలితం వస్తుంది. ఆ తరువాతే వైస్ ప్రెసిడెంట్ – జనరల్ సెక్రటరీ – ట్రెజరర్ ఫలితాలు వెల్లడవుతాయి. ఆఖరుగా ప్రెసిండెంట్ రిజల్ట్ డిక్లేర్ అవుతుంది.