సహజనటి జయసుధ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుసు. 1970 – 80 వ దశకంలో ఆమె తెలుగు సినిమాలతో పాటు సౌత్ సినిమాలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆమె అప్పట్లో ఎన్టీఆర్, శోభన్‌బాబు, ఏఎన్నార్, కృష్ణ లాంటి స్టార్ హీరోలతో నటించి ఎన్నో హిట్లు కొట్టింది. ఆమె సహజ సిద్ధమైన నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతోనే ఆమెకు సహజ నటి అన్న పేరు వచ్చింది.
ఇక ఆమె హీరోయిన్ అవ్వడం వెనక జరిగిన కథ కాస్త ఇంట్రస్టింగ్‌గానే ఉంటుంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కెరీర్‌లోనే జ్యోతి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాగా నిలిచింది. హీరోగా మురళీ మోహన్‌ను అనుకున్నారు. హీరోయిన్ల కోసం కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో వెతుకుతున్నారు. అయితే దర్శకేంద్రుడికి ఎవ్వరూ నచ్చడం లేదు. ఇంతలో మురళీ మోహన్‌కు టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఆయన అప్పటికే లక్ష్మణరేఖ సినిమాలో నటిస్తున్నాడు.
ఆ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జయసుధ అయితే బాగుంటుందని మురళీ మోహన్ రాఘవేంద్రుడికి సూచించారట. అప్పుడు ఆమె ఆల్బమ్ తెప్పించి చూసిన రాఘవేంద్రుడు ఆమెనే హీరోయిన్‌గా ఫైనల్ చేశారట. అలా మురళీ మోహన్ చెప్పిన ఆ మాట వల్ల జ్యోతి సినిమాలో ఆమె హీరోయిన్ అయ్యింది. తర్వాత ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు జయసుధ కెరీర్‌ను ఒక్కసారిగా టర్న్ చేసింది.