టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గురించి ఇండస్ట్రీలో రకరకాల చర్చలు ఉన్నాయి. ఆయన విజయవంతమైన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అన్న పేరుంది. అలాగే ఇండస్ట్రీలో థియేటర్లను తొక్కిపట్టేసి… ఇండస్ట్రీని చంపేస్తున్నారని విమర్శలు ఎదుర్కొనే ఆ నలుగురిలో ఆయన కూడా ఒకరు. ఈ విషయంలో కూడా ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఆయనకు సినిమా రంగంలో ఎదురు లేకుండా పోయింది. ఆయన ఏం చేసినా పెద్ద హీరోలు కూడా థియేటర్ల కోసం, తమ సినిమాల డిస్ట్రిబ్యూషన్ కోసం ఆయన దగ్గర తలవంచక తప్పని పరిస్థితి ఉంది.
అయితే ఇప్పుడు ఆయన ఏపీ ప్రభుత్వం దెబ్బకు కక్కలేక మింగలేక దిగమింగుకుంటున్న పరిస్థితే ఉంది. ఇప్పటి వరకు మకుటం లేని రాజుగా ఉన్న ఆయన పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్న చందంగా ఉంది. ముందుగా వకీల్‌సాబ్ సినిమా ప్రమోషన్లలో ఆయన కాస్త అతిగా వ్యవహరించారన్న టాక్ ఉంది. అది ఆయన సొంత సినిమా.. ఆయన ఇష్టం.
అయితే ఏపీలో ఆ సినిమా హీరో పవన్ కళ్యాణ్.. ఓ రాజకీయ పార్టీ అధినేత. ఆ సినిమా మంచి టాక్‌తో ఉండగానే ఏపీ ప్రభుత్వం సడెన్‌గా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తూ జీవో తీసుకువచ్చి ఆ సినిమా కలెక్షన్ల మీద దెబ్బకొట్టింది. ఇక రిపబ్లిక్ ఫంక్షన్లో పవన్ జగన్, ఏపీ ప్రభుత్వంపై వేస్తోన్న సెటైర్లకు ఆయన పడి పడి నవ్వడంతో వైసీపీ వాళ్లను మరింత మండించేలా చేసిందనే అంటున్నారు.
చివరకు ఇది ఏపీలో సినిమా రంగాన్ని మరింత ముంచేలా చేయబోతోందన్న విషయం ఇండస్ట్రీ వాళ్లు గ్రహించేశారు. కట్ చేస్తే కొందరు పెద్దలు రంగంలోకి దిగి రాజుతో పాటు మరి కొందరిని తీసుకుని వెళ్లి మంత్రి పేర్ని నానితో సమావేశం ఏర్పాటు చేయించారు. పేర్ని నాని ఏ మాత్రం మొహమాటం లేకుండా రాజుతో పాటు ఇండస్ట్రీ వాళ్ల ముందే పవన్‌ను ఓ ఆటాడుకున్నారు. దీంతో రాజు మొఖం మాడిపోవడం ఒకటి అయితే.. ఆయన నవ్వలేక.. ఏడ్వలేక ఓ శిక్షను అనుభవించారు ఆ కాసేపు.
తర్వాత అయిష్టంగానే పవన్ వ్యాఖ్యలకు… ఇండస్ట్రీకి సంబంధం లేదన్నట్టుగా చెప్పాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు రాజు పవన్ ఫ్యాన్స్‌కు టార్గెట్ అయిపోయారు.