కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో చిన్న వయస్సులోనే మృతి చెందారు. పునీత్ మృతితో యావత్ సినిమా పరిశ్రమ అంతా షాక్‌లోకి వెళ్లిపోయింది. కోలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్ లకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలపడంతో పాటు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
పునీత్ కేవలం సినిమా హీరో మాత్రమే కాదు.. ఆయనో డ్యాన్స్ మాస్టర్.. మంచి గాయకుడు.. ఓ నిర్మాత.. ఆడియో కంపెనీ అధినేత.. ఇలా చిన్న వయస్సులోనే ఎన్నో పాత్రల్లో మెప్పించిన పునీత్ 46 ఏళ్ల వయస్సులోనే అందరిని శోక సంద్రంలోకి ముంచేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఇక పునీత్ మొత్తం తన సినిమా కెరీర్లో 29 సినిమాల్లో నటించారు. ఇక పునీత్ తండ్రి రాజ్‌కుమార్ మన తెలుగులో లెజెండ్రీ హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, కృష్ణతో ఎంతో అనుబంధం కలిగి ఉండేవారు. ఇప్పుడు పునీత్‌కు సైతం ఎన్టీఆర్, మహేష్‌తో ఎంతో అనుబంధం ఉండేది.
ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటన అన్నా, డ్యాన్స్ అన్నా పునీత్‌కు చాలా ఇష్టం. పలు సందర్భాల్లో పునీత్ ఎన్టీఆర్ డ్యాన్స్‌ను మెచ్చుకునే వారు. ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం కావడంతో తన సినిమాలో పట్టుబట్టి మరీ ఎన్టీఆర్‌తో గెలయా.. గెలుపే నీదయ్యా సాంగ్ పాడించుకున్నారు. థమన్ మ్యూజిక్ ఇచ్చి ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక పునీత్ మృతితో ఎన్టీఆర్ అభిమానులు కూడా విషాదంలో మునిగి పోయారు.