రెండు తెలుగు రాష్ట్రాల జనాలు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోన్న మా ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభ మయ్యాయి. ఫిల్మ్ నగర్ లోని జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లో మూడు గదుల్లో మా ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో ఇప్పటికే పలువురు ప్రముఖులు ఓట్లేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికలకు ముందుగానే మూడు ప్లటూన్ల బలగాలతో భారీ బందోబస్తు పోలింగ్ కేంద్రం వద్ద మోహరించారు. గొడవలు, తోపులాటలు జరగకుండా పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టారు. అయితే సాఫీగా సాగుతున్న ఎన్నిక్లలో ఒక్కసారిగా చిన్నపాటి గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే పోలింగ్ లో రిగ్గింగ్ జరుగుతుందన్న ఆరోపణలతో ప్రస్తుతం పోలింగ్‌ను నిలిపి వేశారు.
నటులు శివారెడ్డి.. సమీర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. శివారెడ్డి నమూనా బ్యాలెట్ లను పంచుతున్నారంటూ విష్ణు వర్గం ప్రకాష్ రాజ్ వర్గానికి చెందిన వారిపైకి దూసుకు వెళ్లింది. దీంతో అక్కడ మాటా మాటా పెరగడంతో చివరకు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది.దీని పై అధికారులు స్పందిస్తూ.. సీసీ టీవీ ఫూటేజ్ పరిశీలిస్తున్నాం, రిగ్గింగ్ జరిగినట్టు తేలితే ఫలితాలు ప్రకటించమని చెప్పారు.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే..పోలింగ్ కేంద్రానికి సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, సాయి కుమార్ తదితరులు పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా.. ఇప్పటివరకు దాదాపు 150 ఓట్లు పడినట్లుగా తెలుస్తోంది.