కేవలం మహేష్‌బాబు అభిమానులే కాదు.. యావత్ తెలుగు సినిమా అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా.. ఎంతో ఆతృతతో ఎదురు చూస్తోన్న సినిమా మహేష్‌బాబు – రాజమౌళి కాంబినేషన్. ప్రస్తుతం మహేష్ పరశురాం దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ – మహేష్ సినిమా ఉంటుంది. ఆ తర్వాత ప్రాజెక్టే మహేష్ – రాజమౌళిది. దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్. నారాయణ దీనికి నిర్మాత. ఆయన ఎప్పుడో సింహాద్రి సినిమా టైంలో రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చారు.
ఆ బాకీ తీర్చేందుకే ఇప్పుడు రాజమౌళి కేఎల్. నారాయణకు సినిమా చేస్తున్నాడు. అదే టైంలో నారాయణ మహేష్‌కు కూడా ఓ సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చారు. అలా మహేష్ – రాజమౌళి సినిమా సెట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు కొత్త సమస్య వచ్చిందంటున్నారు. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగులోనో లేదా హిందీలోనో కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో క్రేజ్ వచ్చేసింది.
ఈ లెక్కన ఈ సినిమాకు రు. 500 కోట్ల బడ్జెట్ ఉంటుందంటున్నారు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ జోనర్లో ఈ సినిమా తెరకెక్కనుందట. అయితే రు. 500 కోట్ల బడ్జెట్ అంటే నారాయణకు కష్టం. పైగా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు చాలా కీలకం. కేఎల్ నారాయణ ప్రొడక్షన్ చేసి చాలా కాలం అయింది.
అందుకే ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి దిల్ రాజును ఎంటర్ చేయించే ప్లాన్ జరుగుతోందని తెలుస్తోంది. రాజు చేతిలో ఇప్పటికే శంకర్-రామ్ చరణ్, విజయ్-వంశీపైడిపల్లి లాంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా మనోడి చేతిలో పడితే రాజు పేరు నేషనల్ లెవల్లో మార్మోగడం ఖాయం.