టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు దశాబ్దాలుగా ఎంతో మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీలో ఉన్న నేతలు అయినా కూడా మెగాస్టార్‌కు అభిమానులుగా ఉన్నారు. పారిశ్రామిక, సేవా, వైద్య, విద్యా రంగాల్లో ఉన్న వారిలో చాలా మంది ఆయన అన్నా, ఆయన నటన అన్నా పిచ్చెక్కిపోతారు.
ఆయన స్వయంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినా కూడా ఆయన రాజకీయంగా ఎంతో మందికి టార్గెట్ అయినా కూడా ఇతర పార్టీలకు చెందిన వారు చిరును ఎంతో అభిమానించే వారు. ఈ రోజు జగన్ కేబినెట్లో మంత్రులుగా ఉన్న కురసాల కన్నబాబు, గుమ్మనూరు జయరాంకు తన ప్రజారాజ్యంతోనే చిరంజీవి రాజకీయ భిక్ష పెట్టారు. ఇక గంటా శ్రీనివాసరావు తన దశాబ్దాల మంత్రి కలను సైతం చిరంజీవి వల్లే సాకారం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారిలో ఇద్దరు తాము విద్యార్థులుగా ఉన్నప్పుడు చిరంజీవికి వీరాభిమానులు. ఈ విషయాన్ని వారే స్వయంగా చెప్పుకున్నారు. ఈ రోజు పవన్‌కు కౌంటర్ ఇస్తూ మంత్రి పేర్ని నాని స్వయంగా ఈ విషయం చెప్పారు. తాను చదువుకునే రోజుల్లో చిరంజీవి సినిమా రిలీజ్ అయితే తొలి రోజే పూల దండ్లతో చిరు కటౌట్లు అలంకరించడంతో పాటు తొలి షో చూసేవాళ్లమని.. పైగా ఒకటికి రెండు సార్లు సినిమా చూసేవాళ్లమని చెప్పారు.
ఇక మరో మంత్రి కన్నబాబు సైతం చిరంజీవికి వీరాభిమాని. చిరు సినిమాలు కన్నబాబు కూడా తొలి రోజే తొలి షో చూసేసేవారట. ఆ తర్వాత చిరు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి చిరు ప్రజారాజ్యం నుంచే ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. మెగా ఎటాచ్‌తోనే తన మరో సోదరుడు కళ్యాణ్ కృష్ణను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చి మరీ డైరెక్టర్‌ను చేశారు.