సినీ ఇండస్ట్రీలో బిజినెస్ మొదలు పెట్టాలి అనే ఆలోచన ఇప్పటిది కాదు, ఆ కాలంలోనే మొదలైంది. ప్రముఖ హీరోగా గుర్తింపు పొందిన నందమూరి తారక రామారావు అలాగే అక్కినేని నాగేశ్వరరావు లు కూడా సొంత నిర్మాణ సంస్థలను కూడా ఏర్పాటు చేసి, రెండు చేతుల బాగానే సంపాదించేవారు. వీరిని చూసుకొని ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం, ఇప్పటికీ ఆ నిర్మాణ సంస్థ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించడం జరుగుతోంది. ఇక ఆంధ్ర సోగ్గాడు గా గుర్తింపు పొందిన శోభన్ బాబు కూడా ఒక థియేటర్ ను నిర్మించాలని అనుకున్నారట. కానీ ఆ థియేటర్ కు శుభం కార్డు పడకముందే ఆగిపోయింది.
శోభన్ బాబు అసలు పేరు శోభను చలపతిరావు. హీరోగా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అంతే కాదు ఈయన నటన , భాషా ప్రావీణ్యం ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకట్టుకునేది. ఆంధ్రుల అందగాడిగా గుర్తింపు పొందిన శోభన్ బాబు ఎన్నో చిత్రాలలో నటించి ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన శోభన్ బాబు, నాటకం మీద ఇష్టంతో మొదట నాటక రంగంలోకి ప్రవేశించాడు. అప్పట్లో స్టేజ్ షోలు కూడా ఇచ్చి, అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినీరంగంలోకి ప్రవేశించారు.. అప్పుడు సినిమా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే తన పేరును శోభన్ బాబుగా మార్చుకోవడం జరిగింది.
పౌరాణిక పాత్రల్లో కూడా నటించిన శోభన్ బాబు ఎన్టీఆర్ , ఏఎన్నార్ ల వల్లే తనకు మంచి సినిమా అవకాశాలు కూడా వచ్చేవి అని ఆయన అప్పట్లో చెప్పేవారు. ఇకపోతే శోభన్ బాబు కూడా హైదరాబాదులో ఒక సినిమా థియేటర్ ను స్థాపించాలని నిర్ణయించుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ థియేటర్ కట్టడానికి సాధ్యం కాలేకపోయింది. 1975వ సంవత్సరంలో మద్రాస్ నుంచి టాలీవుడ్ సినీ తారలు హైదరాబాద్ కి వస్తున్న తరుణంలో, హైదరాబాద్ లో ఒక మంచి స్థలాన్ని చూసి అక్కడ థియేటర్ నిర్మించాలనుకున్నారు. కానీ అది జరగకపోవడంతో ఆయన తన సంపాదించిన డబ్బును స్థలాలకు , ఇంటి నిర్మాణాలకు కేటాయించడం జరిగింది.