విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1982లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలలలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో ఓ సంచలనం. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు.. తాను గెలుస్తానని.. ముఖ్యమంత్రిని అవుతానన్న నమ్మకం ఆయనకు కూడా పూర్తిగా లేదట. అందుకే ఆయన పార్టీ పెట్టాక కూడా … ఆ తర్వాత కూడా సినిమాలు చేస్తానని పలువురు నిర్మాతల దగ్గర అడ్వాన్స్‌లు కూడా తీసుకున్నారట.
అప్పటికే కాంగ్రెస్ జాతీయ పార్టీగా పలు రాష్ట్రాల్లో దశాబ్దాల పాటు అధికారంలో ఉంది. తనది కొత్త పార్టీ అని… తన పార్టీకి గొప్పగా వస్తే 60 సీట్లకు మించి రావన్న లెక్కల్లో ఎన్టీఆర్ ఉండేవారట. ఈ విషయం చాలా యేళ్ల తర్వాత తాజాగా ఎన్టీఆర్ సమీప బంధువు, ప్రముఖ నిర్మాత కాకర్ల కృష్ణ బయట పెట్టారు. అందుకే ఆయన ఎన్నికల తర్వాత కూడా సినిమాలు చేద్దామని.. తాను అడ్వాన్స్‌లు తీసుకున్న నిర్మాతలకు చెప్పారట.
అయితే అనూహ్యంగా తొలి ఎన్నికల్లోనే ఎన్టీఆర్ టీడీపికి ఏకంగా 200కు పైగా సీట్లు రావడం.. ఆయన ముఖ్యమంత్రి అయిపోవడం జరిగిపోయాయి. ఇదే విషయమై కాకర్ల కృష్ణ చెపుతూ.. ఎన్టీఆర్‌కు రాజకీయాలలోకి వెళ్లినా.. తాను సీఎం అవుతానన్న నమ్మకం లేదని.. అందుకే ఆయన తనకు కూడా ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చారని ఆయన చెప్పారు.
ఇక ఎన్టీఆర్‌కు అంతకు ముందు కూడా రాజకీయాలపై అంత ఆసక్తి లేదట. అయితే ఆయన రాజకీయాల్లోకి రావడానికి ముందు చేసిన కొన్ని సినిమాల వల్ల ప్రేరేపితులు అయ్యి..ఆ తర్వాత కాంగ్రెస్ నిరంకుశ విధానాలు ఎదిరిస్తూ పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఆయన సీఎం అవ్వడం.. తిరిగి 1985లో ప్రభుత్వాన్ని రద్దు చేసి మరోసారి ఎన్నికలకు వెళ్లి అప్రతిహత విజయం సొంతం చేసుకోవడం మనకు తెలిసిందే..!