మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా) ఎన్నికలు మాంచి రసవత్తరంగా మారాయి. ఈ యేడాది మా ఎన్నికల్లో ఏకంగా ఐదుగురు సభ్యులు పోటీలో ఉంటున్నారు. ఎప్పుడూ లేనట్టుగా మాలో లోకల్ – నాన్ లోకల్, కుల వాదం, ప్రాంతీయ వాదం, పార్టీలు ఇలా రచ్చ రచ్చగా మారింది. ఈ గొడవల్లో కొందరు మా తాజా మాజీ అధ్యక్షులు నరేష్‌ను కూడా టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దీనికి నరేష్ కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే మా రచ్చ పై నరేష్ మాట్లాడుతూ తాను ఆరేళ్ల పాటు మాలో వివిధ పదవుల్లో పని చేశానని.. తనను అభిమానించే వారు వందల్లో ఉంటారని ఆయన అన్నారు.
తాను ఇప్పటకీ మా ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తానని.. అయితే గతంలో అధ్యక్షుడిని అయినప్పుడే తాము మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించానని.. గత ఎన్నికల్లో నాది అర్జునుడి పాత్ర అయితే ఇప్పుడు కృష్ణుడి పాత్ర అని నరేష్ చెప్పారు. ఇక తాను ఏ రథంలో కూర్చొంటానో అన్నది త్వరలోనే డిసైడ్ చేస్తానని చెప్పారు. ఇక తన విషయంలో మెగాబ్రదర్ చిరంజీవి ఒకలా.. నాగబాబు మరోలా మాట్లాడరని కూడా నరేష్ ఫైర్ అయ్యారు.
మా సభ్యుల బీమా కోసం తాను రూ 14 లక్షలు ఇచ్చినప్పుడు చిరంజీవిగారు ఫోన్ చేసి మెచ్చుకున్నారని నరేష్ తెలిపారు. చాలా మంచి పనిచేశావని చిరంజీవి అభినందించారని.. అయితే ఇప్పుడు నాగబాబు గారు మా ప్రతిష్ట మసక బారిందని అంటారు.. అన్నయ్య అభినందిస్తే.. తమ్ముడు తిట్టడం ఏంటని నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా మా విబేధాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. మా రచ్చ మరింత రచ్చ కెక్కడం ఖాయంగా ఉంది.