లేడీ అమితాబచ్చన్ విజయశాంతికి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా… తెలుగు ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా.. రాజకీయాల్లోనూ ఆమె ఓ సంచలనమే.. ! ఈ రోజు తన 55వ పుట్టిన రోజు జరుపుకుంటోన్న విజయశాంతి తెలుగు సినిమాను 30 ఏళ్ల పాటు ఏలేశారు. వివిధ భాషల్లో ఆమె మొత్తం 180 సినిమాల్లో నటించారు. ఆమెకు 7 సార్లు దక్షిణాది పురస్కార అవార్డులు, 6 సార్లు ఉత్తమ నటి అవార్డులు వచ్చాయి. 1990వ దశకంలో ఆమె అప్పటి స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న రికార్డు తన పేరిట నెలకొల్పారు.
ఆ తర్వాత ఆమె శ్రీనివాస ప్రసాద్ అనే బిజినెస్‌మేన్‌ను పెళ్లాడారు. వీరిది ప్రేమ వివాహం. విజయశాంతి సినిమాల్లో ఉన్నప్పటి నుంచే వీరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది. వీరికి పిల్లలు లేరు. శ్రీనివాస ప్రసాద్‌కు బాలయ్యకు బెస్ట్ ఫ్రెండ్. ఆ పరిచయంతోనే విజయశాంతికి, శ్రీనివాస ప్రసాద్‌కు మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి వారు పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. ఇక బాలయ్య – విజయశాంతి కాంబినేషన్లో మొత్తం 17 సినిమాలు వచ్చాయి.
1992లోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ముందు బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడి తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. ఆ తర్వాత తన పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి మెదక్ నుంచి లోక్‌సభకు ఎంపికయ్యారు. ఇక 2014 ఎన్నికల వేళ ఆమె కాంగ్రెస్ లో చేరి మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్‌లో గుర్తింపు లేదని ఆమె తిరిగి బీజేపీ గూటికి చేరిపోయారు.