గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ మంత్రి కొడాలి నానిని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు కాచుకుని ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సుతో చంద్రబాబు దయతో రెండుసార్లు టీడీపీ టిక్కెట్ దక్కించుకున్న నాని ఆ తర్వాత వైసీపీలోకి జంప్ చేసి అక్కడ కూడా రెండు సార్లు గెలిచి మంత్రి అయ్యారు. ప్రభుత్వం అధికారంలో ఉండడంతో నాని మాట్లాడే మాటలు.. జుగుస్సాకరమైన భాష ఇవన్నీ తెలుగుదేశం కార్యకర్తల్లో తీవ్ర అసహనానికి కారణమయ్యాయి. అయితే వైసీపీ బలంగా ఉంది. నాని చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన ఏకైక మంత్రి.. అటు వైసీపీ వాళ్లు రెచ్చగొడుతున్నారో ? ఏమోగాని నాని మాట్లాడే మాటలకు అడ్డూ అదుపూ లేదు.
నానికి బూతుల మంత్రి అన్న పేరు పెట్టేశారు. మీడియాలో సైతం నానిపై విమర్శలు వస్తున్నా అదే తనకు గొప్పన్న చందంగా ఆయన మరింతగా రెచ్చిపోతుండడం ఆయనకు పరిపాటి అయ్యింది. అసలు గుడివాడ అంటేనే నందమూరి ఫ్యామిలీకి కంచుకోట.. అలాంటి నందమూరి అడ్డాను ఇప్పుడు నాని తన కంచుకోటగా మార్చేసుకున్నారు. ఎలాగైనా నానిని వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి ఓడించి.. తరిమి వేయాలని అటు పార్టీ అధిష్టానం నుంచి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సామాన్య కార్యకర్త వరకు అందరూ కాచుకునే ఉన్నారు. ఇందుకోసం తాము ఏం చేయాలంటే అది చేస్తామన్నంత కోసం నానిపై వాళ్లలో రగులుతోంది.
ఈ క్రమంలోనే నానిని ఓడించేందుకు బాబు ఎప్పుడూ సరైన క్యాండెట్‌ను రెడీ చేయలేకపోతున్నారు. అయితే ఈ సారి నందమూరి కోటను నందమూరి వారసులతోనే బద్దలు కొట్టించి కొడాలికి చెక్ పెట్టే ప్రయత్నం, చర్చలు టీడీపీలో మొదలయ్యాయి. టీడీపీ లో ఎన్టీఆర్ మనవళ్లలో నందమూరి తారకరత్న, నందమూరి చైతన్య కృష్ణ ఇద్దరూ ఉన్నంతలో పార్టీ కోసం అప్పుడప్పుడు పని చేస్తున్నారు. తారకరత్నం గతంలో ఏపీలో ప్రచారం చేశారు. ఇక కూకట్‌పల్లిలో సుహాసిని పోటీ చేసినప్పుడు కూడా ఆమె కోసం ప్రచారం చేసి కేడర్‌లో జోష్ నింపారు.
ఆ తర్వాత తారకరత్న ఏపీ రాజకీయాలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. అయితే నందమూరి చైతన్యకృష్ణ మాత్రం వీలున్నప్పుడల్లా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడం.. వైసీపీ రాజకీయాలను విమర్శిస్తూ వస్తున్నారు. తాజాగా కొడాలి నానిపై చైతన్య కృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బాబు, లోకేష్‌పై ఒక్క అవినీతి కేసు కూడా లేదన్న చైతన్య చంద్రబాబు ఇంటా వంటా రౌడీయిజం లేదన్నారు. కొడాలి నాని తీరు మార్చుకోవాలని లేదంటే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు.
చైతన్య కృష్ణ దూకుడు చూస్తోన్న కొందరు పార్టీ పెద్దలు ఆయన్ను వచ్చే ఎన్నికల్లో గుడివాడ బరిలో దింపాలని పార్టీ పెద్దలకు సూచనలు చేస్తున్నారు. చైతన్య గుడివాడ బరిలో ఉంటే నందమూరి సెంటిమెంట్‌తో పాటు బాలయ్య, తారకరత్న లాంటి వాళ్లు ప్రచారం చేస్తే నానికి చెక్ పెట్టే ఛాన్సులు అయితే ఉన్నాయి. మరి చంద్రబాబు ఆలోచనలు ఎలా ? ఉంటాయో ? చూడాలి.