పాతాళభైరవిలో ఎన్టీఆర్‌ను నరుడా ఏమీ నీ కోరిక అని అడిగేది ఎవరో గుర్తుందా? ఆమె గిరిజ. గిరిజ ఎవరో ఈ తరం వారికి తెలియక పోవచ్చు. తెలుగులో తొలిసారిగా స్టార్ ఇమేజ్ పొందిన హాస్యనటి. ఇప్పుడు మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ ఎంత గొప్ప హీరోలైనా కావచ్చు ఆ సినిమా హిట్టు కావాలంటే బ్రహ్మానందం ఉండాల్సిందే.. అలానే 50-60 ప్రాంతాల్లో సినిమా సూపర్ హిట్టు కావాలంటే రేలంగి, గిరిజ జంట ఉండాల్సింది. వీరుంటే సినిమా హిట్టు అని ఆ కాలం నాటి తెలుగు సినిమా సక్సెస్ ఫార్ములా.. ఆ విధంగా ఎన్నో సినిమాల్లో నటించి గిరిజ గొప్ప పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నారు.
తెలుగులో తొలి తరం హాస్యనటిమణులలో గిరిజా ఒకరిగా కనిపిస్తారు. ఒకవైపున గయ్యాలి తనం.. మరోవైపు హాస్యాన్ని పండించడంలో గిరిజ సిద్ధహస్తురాలు. రేలంగి జోడిగా సూర్యకాంతం గారాల కూతురుగా తెలుగు తెరపై గిరిజ చేసిన సందడి అంతా ఇంతా కాదు.
‘కాశీకి పోయాను రామాహరే… గంగలో మునిగాను రామాహరే’ ఈ పాట వింటే గిరిజే గుర్తుకొస్తారు. ‘సరదా సరదా సిగిరెట్టు’ పాట కూడా ఆమెదే కదా. తెలుగులో తొలితరం కామెడీ స్టార్స్‌లో ఒకరుగా వెలిగారు గిరిజ. కృష్ణాజిల్లా కంకిపాడు నుంచి చెన్నై వెళ్లి రేలంగి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ‘పాతాళభైరవి’లో ఆమె పలికిన ‘నరుడా… ఏమి నీ కోరికా’ పెద్ద హిట్ అయ్యింది.
‘లవకుశ’లో కీలకమైన రజకుని భార్య వేషం కట్టారు. ‘ఒల్లనోరి మామా’ పాట జనాదరణ పొందింది అందులో. భర్త సన్యాసి రాజుతో కలిసి ‘భలే మాస్టారు’, ‘పవిత్ర హృదయాలు’ సినిమాలు తీసి ఆర్థికంగా నష్టపోయారు. వంద సినిమాల్లో చేస్తే వచ్చిన డబ్బు ఒక్క సినిమా తీస్తే పోతున్నది గిరిజ విషయంలోనూ జరిగింది. చివరికి అద్దె కూడా కట్టలేని దీన స్థితిలోకి వెళ్లారు. ఎంతోమందిని నవ్వించిన గిరిజ తీరని కష్టాలను అనుభవిస్తూ మరణించడం గమనార్హం.
మహారాణిలా జీవించిన గిరిజ సినిమా కథలానే ఊహించని మలుపులతో ఇల్లు గడవడం కోసం చేయి చాచాల్సిన స్థితిలో పడిపోయింది. ఆమె ఎక్కువగా హాస్య ప్రధానమైన పాత్రల్లోనే నటించింది. కోట్లాది మందిని దశాబ్దాల పాటు నవ్వుల్లో ముంచెత్తింది. కష్టాలు మరిచిపోయి ఆ మూడు గంటల పాటైనా నవ్వుకునే అవకాశం ఆమె సినిమాల్లో దొరికేది. కానీ చివరకు ఆమె జీవితం మాత్రం విషాదంగా ముగిసిపోయింది.