ప్రస్తుతం హుజూరాబాద్, రేవంత్ రెడ్డి వార్తల కంటే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వీటికి సాధారణ ఎన్నికల రేంజ్ హడావిడి చేస్తున్నారు. మాలో ఎప్పుడూ లేనట్టుగా లోకల్ – నాన్ లోకల్ ఫీలింగ్ తో పాటు ఎప్పుడూ ఉండే కులాల కుంపు, తెలంగాణ వాదం, ఏపీ, తెలంగాణ ఇలా చాలా అంశాలు దూరేశాయి. ఇక నాలుగేళ్ల మా కార్యకలాపాలపై ప్రకాష్, నాగబాబు విమర్శలు చేయడం… వీటిని నరేష్ లాంటి వాళ్లు ఖండించడం జరిగాయి. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మా ఎన్నికలపై స్పందించారు.
ఓ టీవీ ఛానెల్లో మాట్లాడిన కోట మా ఎన్నికల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మా ఎన్నికలను ఎవరు ప్రకటించారని ప్రశ్నించారు. ఎవరో ప్యానెల్ ప్రకటించారు.. చిరంజీవి ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇచ్చారో లేదో కాని.. నాగబాబు దీనిపై మాట్లాడడం సరైంది కాదని కోట తన అభిప్రాయం కుండబద్దలు కొట్టేశారు. ప్రకాష్ రాజ్‌కు మద్దతుగా నాగబాబు మాట్లాడడం కరెక్ట్ కాదని కోట అన్నారు.
అసలు ప్రకాష్ రాజ్ తెలుగు భాషా నటుడు కాకపోయినా కూడా తెలుగు దర్శక, నిర్మాతలు పెద్ద పీఠవేశారంటూ కోట గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట, ప్రకాష్ రాజ్ మధ్య వివాదం కూడా ఉంది. విచిత్రం ఏంటంటే కోట, ప్రకాష్ రాజ్ బీజేపీలోనే ఉన్నారు. అయినా మా ఎన్నికల సాక్షిగా వీరి మధ్య వివాదం ముదరగా… ప్రకాష్ పోటీపై కోట అసంతృప్తి వ్యక్తం చేశారు.