ఉదయ్ కిరణ్..ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన తారాజువ్వ ఉదయ్ కిరణ్. వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు ఈ హీరో. ‘చిత్రం’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తిచేశాడు. అప్పట్లోనే లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడీ యంగ్ హీరో. వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటించి టాప్ హీరోలకు సైతం పోటీనిచ్చాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు ఉదయ్ కిరణ్.
ఉదయ్ కిరణ్.. తేజ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘చిత్రం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ‘చిత్రం.. ది పిక్చర్’ తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. కేవలం నెలన్నర రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఆర్పీ పట్నాయక్ అందించిన ఆడియో సాంగ్స్‌తో సగం హిట్ సాధించింది. అంతేకాదు ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్తేజ.. యూత్‌ఫుల్ సబ్జెక్ట్ ప్రజంటేషన్‌తో సెన్సేషన్ హిట్ అయ్యింది. ఉదయ్ కిరణ్, రీమా సేన్, చిత్రం శీను&కో.. ఇలా ఎందరో ఆర్టిస్టుల కెరీర్‌కు ఈ మూవీ ఒక పాథ్‌ను ఏర్పరిచిందనే చెప్పాలి.
నిజానికి చిత్రం మూవీ లో ఉదయ్ కిరణ్ హీరో గా చెయ్యాల్సింది కాదు. ఫ్రెండ్స్ గ్రూపులో ఒకడిగా ఉదయ్‌ను ఎంచుకున్నానని.. హీరోగా మరో కుర్రాడిని అనుకున్నా కూడా ఆయన కాదనే సరికి చివరికి తననే తీసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో తేజ చెప్పాడు. ఇక ఈ చిత్రం కోసం ఉదయ్ కిరణ్ 11వేల రూపాయలు పారితోషకంగా తీసుకున్నాడట. కానీ, ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద కలెక్షన్స్ కొలగొట్టింది. అప్పట్లోనే 8కోట్లు వసులు చేసింది. సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు అనుకున్న ఉదయ్ కిరణ్ 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 11 వేలతో మొదలై కోట్ల వరకు పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగిన ఉదయ్.. అంతే చిత్రంగా తన జీవితాన్ని ముగించడం మాత్రం అందరికీ తీరని విషాదమే.