తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ కమెడీయన్స్‌లో వేణు మాధవ్ ఒకరు. ఆయన కామెడీ ప్రేక్షకులకి ఎంత వినోదం అందిస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన వేణు మాధవ్ 2019 సెప్టెంబర్ 25 చనిపోయారు. కేవలం 49 ఏళ్ళకే వేణు మాధవ్ అనారోగ్యంతో మరణించారు. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ వేణు మాధవ్ చనిపోయి రెండేళ్ళవుతుంది. అయినా కూడా ఈయన మరణాన్ని అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. ఇప్పటికీ ఏదైనా సినిమాలో ఈయన కామెడీ వచ్చినపుడు మనసారా నవ్వుకుంటారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నల్గొండ జిల్లా, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని కోదాడలో జన్మించిన వేణుమాధవ్ మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రస్థానం మొదలు పెట్టారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా నటించిన ‘సంప్రదాయం’ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయనకు పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘తొలిప్రేమ’ సినిమాతో గుర్తింపు లభించింది.
వేణు మాధవ్ 170కి పైగా సినిమాల్లో నటించారు. ఆది, దిల్, సింహాద్రి, సై, లక్ష్మి, ఛత్రపతి.. ఇలా పలు సినిమాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులను బాగా అలరించాయి.ఆయన చివరిగా నటించిన చిత్రం 2016లో విడుదలైన డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్.2006లో ఉత్తమ హాస్య నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు.
చాలా ఏళ్లుగా వేణు మాధవ్ హైదరబాద్‌లోని మౌలాలిలో సెటిల్ అయిపోయాడు. అయితే వేణు మాధవ్‌కి చాలా ఆస్తులు ఉన్నాయనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పాడాయన. అంతేకాదు అదే ఇంటర్వ్యూలో తనకు ఎక్కడెక్కడ ఏయే ఆస్తులున్నాయో చెప్పుకొచ్చాడు వేణు మాధవ్.
ఈసీఐఎల్ నుంచి మౌలాలి వరకు తనకు పది ఇళ్లు ఉన్నాయని అప్పట్లో తెలిపిన వేణు కరీంనగర్ జిల్లాలో 10 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయని అన్నాడు. పైగా చనిపోయిన తర్వాత వేణు మాధవ్ భార్య, కొడుకులు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని తెలిపారు. ఇప్పుడు వేణు మాధవ్‌కి ఉన్న ఆస్తుల విలువని నేటి మార్కెట్‌తో లెక్కిస్తే వందల కోట్లలో ఉంటుందని సమాచారం. డబ్బుల రూపంలో కాకపోయినా స్థిరాస్థులు మాత్రం బాగానే సంపాదించాడు వేణు.