తూర్పుగోదావరి జిల్లాలోని రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో కీలకమైనది రాజోలు. ఇక్కడ గత ఏడాది ఎన్నికల్లో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. అయితే, ఇక్కడ కీలక నాయకుడిగా ఉన్న బొంతు రాజేశ్వరరావు వరుస ఓటములతో ఒకింత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ఆయన ఇరిగేషన్ విభాగంలో కీలకమైన అధికారిగా పనిచేశారు. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసి.. 2014లో వైసీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేశారు. అయితే.. టీడీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావుపై 4 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఏడాది ఎన్నికల్లోనూ వైసీపీ టికెట్ ఇచ్చినా.. కేవలం 8 వందల ఓట్ల తేడాతో.. ఓడిపోయారు.
దీంతో జగన్ ఇక్కడ బొంతును తప్పించి.. నియోజకవర్గం బాధ్యతలను మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీకి అప్పగించారు. దీంతో ఇక్కడ బొంతు రాజేశ్వరరావు, ఎమ్మెల్యే రాపాక, అమ్మాజీలు మూడు వర్గాలుగా విడిపోయి.. రాజకీయాలు చేసుకుంటున్నాయి. అయితే, వీరిలో పార్టీ కోసం ఏడెనిమిదేళ్లుగా కష్టపడింది మాత్రం బొంతు రాజేశ్వరావే. ఆయన్నే ఇక్కడ పార్టీ నేతగా కొనసాగించాలని పార్టీ కేడర్ మొత్తం కోరుకుంటోంది. అయితే అక్కడ రాజకీయం మొత్తం తామే శాసించాలని చూసే ఓ అగ్రకుల నేతలు దురహంకారంతోనే బొంతును తొక్కాలని చూస్తున్నారు.
ఇదిలా ఉంటే బొంతుకు నియోజకవర్గంలో పలువురు కీలక నేతలు సపోర్ట్ చేస్తున్నారు. బొంతు ముఖ్య అనుచరుడు దొండపాటి ప్రసన్నకుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి బొంతు అనుచరుడుగా పార్టీ కార్యక్రమాలలో ముఖ్య పాత్ర పోషించి.. మలికిపురం మండలం ఐటీ విభాగం ప్రెసిడెంట్ గా నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో వుండే నాయకుడుగా ప్రసన్న గుర్తింపు పొందారు. అదే సమయంలో కొత్తగా నియమించిన మార్క్కెట్ యార్డ్ కమిటీ లో దొండపాటి ప్రసన్నకుమార్‌ను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా పార్టీ అధిష్టానం నియమించింది.
విద్యావంతుడు, సేవా గుణం కలిగిన ప్రసన్న అన్ని కులాలు, మతాల వారినీ కలుపుకొనిపోతున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆయనకు మంచి పేరు వస్తోంది. నాలుగు మండలాల్లో ప్రతి గ్రామంలోనూ ప్రసన్నకు మద్దతు దారులు ఉండడం గమనార్హం. ప్రసన్నకు బొంతు అండదండలతో పాటు అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో రాజోలు రాజకీయాల్లో ప్రసన్న మార్కు కనిపించడం ఖాయమని.. రాబోయే రోజుల్లో కీలక మార్పు తథ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.