`బాహుబలి` చిత్రంలో తెలుగు సినిమా సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి.. షూటింగ్ విషయంలో మాత్రం ఎప్పుడూ లేటే. దాదాపు ఐదేళ్లు కష్టపడి బాహుబలి చిత్రాన్ని జక్కన్న తెరకెక్కించాడు. ఆయనపై నమ్మకంతో ప్రభాస్ కూడా తన కెరీర్లో 5 ఏళ్లు బాహుబలికే కేటాయించాడు.
అయితే రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న `ఆర్ఆర్ఆర్` మాత్రం ఏడాదిలోనే పూర్తి చేస్తానని ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ముందే మాటిచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 8న ఆర్ఆర్ఆర్‌ను రిలీజ్ చేస్తామని డేట్‌ను కూడా ప్రకటించాడు. కానీ, జక్కన్న మాత్రం షూట్ ఫినిష్ చేయలేక రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. ఇంతలోనే కరోనా వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.
అయితే ఇలా ప్రతి సినిమాకూ ఏళ్ల తరబడి సమయం తీసుకుంటోన్న రాజమౌళి తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో ప్రకటించారు. కానీ, మహేష్ బాబు మాత్రం ఏ సినిమాకైనా కేవలం ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం మాత్రమే కేటాయిస్తున్నాడు. మరి ఇలాంటి వర్కింగ్ స్టయిల్‌కి అలవాటు పడిన మహేష్.. రాజమౌళి సినిమాకు రెండు, మూడేళ్ల టైమ్ కేటాయించగలడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజంగానే అన్నేళ్లు తీసుకుంటే.. ఖచ్చితంగా జక్కన్నతో మహేష్ సినిమా కష్టమే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.