బుల్లితెరపై హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక జబర్దస్త్ షోలో ఎంతమంది కంటెస్టెంట్లు ఉన్నా కూడా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది స్కిట్లు చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇక హైపర్ ఆది పంచ్‌లు ఎలా పేలతాయో తెలిసిందే. హైపర్ ఆది ఈ రోజు బుల్లితెరపై లక్షలాది మంది ప్రేక్షకుల మనస్సులను గెలుచుకున్నాడంటే దాని వెనక ఎంతో కష్టం ఉంది. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆది ఇండస్ట్రీకి రాకముందు ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేశాడు.
ఆ తర్వాత రైటర్‌గా మారాడు. ఆ తర్వాత కమెడియన్ అభి పరిచయంతో జబర్దస్త్‌లోకి వచ్చి అక్కడ టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు బుల్లితెరపై తిరుగులేకుండా పాపులర్ అయ్యాడు. అయితే ఆది ఈ స్థాయికి రావడం వెనక ఎంతో కష్టం ఉందని చెపుతుంటాడు. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆది తన ఇద్దరు అన్నలతో పాటు తన చదువుల కోసం తండ్రి తమకు ఉన్న మూడెకరాల పొలం అమ్మేశాడని చెప్పాడు.
ఆ తర్వాత ఆది బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఆ తర్వాత ఆది జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇవ్వడం చాలా మందికి నచ్చలేదట. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం వదిలి ఈ రంగంలోకి ఎందుకు వచ్చావని ఎన్నో మాటలు కూడా అన్నారట. ఇక ఆది ఈ స్థాయికి రావడంతో పాటు తన తండ్రి ఏ ఊళ్లో అయితే మూడెకరాల పొలం అమ్మేశాడో అక్కడే పది ఎకరాల భూమి కొనడంతో పాటు పెద్ద ఇళ్లు కూడా కట్టించాడట.
ఇక అతడికి హైదరాబాద్‌లో ఉన్న ప్లాట్లు, ఇతర స్థిరాస్తుల విలువ కూడా కలుపుకుంటే రు. 5 కోట్లకుపైనే అతడి ఆస్తి ఉంటుందని.. అనధికారిక లెక్కల ప్రకారం ఇది మరింత ఎక్కువే ఉంటుందని అతడి సన్నిహితులు చెపుతూ ఉంటారు. ఏదేమైనా తాను పడిన కష్టమే ఆదిని ఈ రోజు ఇంత వరకు తీసుకువచ్చింది.