భారతీయ సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించి ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత బాహుబలి సినిమాకే దక్కుతుంది. ఆ మాటకు వస్తే ప్రాంతీయ సినిమాగా ఉన్న తెలుగు సినిమా రేంజ్‌ను బాహుబలి ప్రపంచానికి చాటి చెప్పిందనే అనాలి. ఓ ప్రాంతీయ సినిమాకు ఇంత సత్తా ఉంటుందా ? అని ఎంతో మంది మహామహులు నోరెళ్లబెట్టేలా చేసింది బాహుబలి. ఈ సినిమా ఏకంగా రు. 2 వేల కోట్ల వసూళ్లు రాబట్టింది.
బాహుబలి కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో హిట్ అయ్యింది. విదేశీ సినిమా పరిశ్రమలకు చెందిన దర్శకులు, టెక్నీషియన్లను సైతం మెప్పించిన బాహుబలి సినిమా వచ్చాక ఇండియన్ సినిమాపై సైతం ఇతర దేశాల సినీ పరిశ్రమలకు చెందిన టెక్నీషియన్లు సైతం దృష్టి సారించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓ విదేశీ మంత్రినే మెప్పించింది.
తైవాన్ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జోసెఫ్ వూ మాట్లాడుతూ బాహుబలి తన ఫేవరెట్ సినిమా అని.. ఆ సినిమా టీవీలో వస్తుంటే తాను ఛానెల్ మార్చవద్దని చెపుతానని చెప్పారు. బాహుబలి తాను ఎన్నిసార్లు చూశానో తనకే తెలియదని.. ఇండియన్ సినిమా చూస్తుంటే చాలా సరదాగా ఉంటుందని జోసెఫ్ చెప్పారు. ఏదేమైనా ఓ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిని బాహుబలి అంతగా మెప్పించడం గొప్ప విషయం.