తెలుగు సినిమా చరిత్రను దేశవ్యాప్తంగానే కాకుండా ఎల్లలు దాటించిన ఘనత ఖచ్చితంగా దర్శకధీరుడు రాజమౌళికే దక్కుతుంది. కె. రాఘవేంద్రరావు శిష్యుడు అయిన రాజమౌళి సినిమా డైరెక్టర్ కాకముందు శాంతినివాసం అనే సూపర్ డూపర్ హిట్ సీరియల్‌ను డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి నేటి బాహుబలి – ది కంక్లూజన్ వరకు ప్లాప్ సినిమా లేకుండా దూసుకుపోతున్నాడు. బాహుబలి 1, 2 సినిమాల తర్వాత ఇప్పుడు రాజమౌళి ఇంటర్నేషనల్ దర్శకుడు అయిపోయాడు.
ప్రస్తుతం రాజమౌళి 13వ సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ రోజు రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా అందరు హీరోలు అభిమానులు రాజమౌళికి విషెస్ చెపుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇక రాజమౌళి సొంత ఊరు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు. రాజమౌళి ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజ్‌లోనే చదివారు. ఆ తర్వాత రాజమౌళి సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌లో ఉన్నారు.
ఇదిలా ఉంటే రాజమౌళి పుట్టింది మాత్రం కర్నాకటలో. అక్టోబర్ 10, 1973 వ సంవత్సరంలో కర్ణాటకలోని రాయచూరులో జన్మించారు. వాళ్ల కుటుంబం అప్పట్లో ఏపీ నుంచి కర్నాకటలోని రాయచూర్ ప్రాంతానికి వలస వెళ్లడంతో రాజమౌళి అక్కడే జన్మించాడు. అయితే వాళ్ల కుటుంబం స్వతహాగా సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబం కావడంతో రాజమౌళికి చిన్న తనం నుంచి సినిమా వాతావరణం అలవాటైంది.
ఇక రాజమౌళికి కర్నాటకలోని రాయచూర్, బళ్లారి ప్రాంతాలతో ఎంతో అనుబంధం ఉంది. ఇప్పటకీ విశ్రాంతి కోసం అక్కడికే వెళుతుంటాడు. కర్నాటకలోని పలు దేవాలయాలను దర్శిస్తుంటాడు.