తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై ఓ వీఆర్వో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పి. వివేకానంద తనను బెదిరించాడని గాజుల రామారం వీఆర్‌ఓ శ్యామ్ కుమార్ ఆరోపించారు. నాలుగు రోజులుగా ఈ వ్యవహారంతో పాటు ఎమ్మెల్యే వీఆర్వోను తిడుతోన్న వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇక తహసీల్దార్ ఆదేశాల మేరకే తాను తన డ్యూటీలో భాగంగా ప్రభుత్వ భూమిలో ఉన్న అక్రమాలు కూల్చి వేస్తుంటే ఎమ్మెల్యే ఫోన్ చేసి తనను తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించాడని శ్యామ్ కుమార్ ఆరోపణలు చేశాడు. ఎమ్మెల్యేపై మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన శ్యామ్ కుమార్ తనతో పాటు రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే తిడుతోన్న ఆడియో టేపులను కూడా పోలీసులకు అందజేశాడు.
ఎమ్మెల్యే వివేకానందపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శ్యామ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక ఎమ్మెల్యే వీఆర్వోను తిడుతోన్న వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిపై అనేక చర్చలు కూడా నడుస్తున్నాయి. ఎమ్మెల్యే తీరుపట్ల రెవెన్యూ ఉద్యోగులు మేడ్చల్ కలక్టర్ వద్ద ఇప్పటికే నిరసన వ్యక్తం చేశారు.