ఇరవై సంవత్సరాల క్రితం అక్టోబర్ 13న విడుదలైన నువ్వే కావాలి సినిమా అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుని సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ చాలానే ఉంది. మళయాళంలో హిట్ అయిన నిరమ్ సినిమా చూసిన ప్రముఖ నిర్మాత ఎమ్మెస్స్ రెడ్డి రామోజీరావుతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయమని కోరారు. అయితే అప్పటికే ఆ రైట్స్ ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ తీసుకున్నారు. దీంతో రామోజీ స్రవంతికి మంచి ఆఫర్ ఇచ్చారు. సినిమా ఖర్చంతా మాదే.. మా ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ చేయమన్నారు.
అలా ఆ సినిమాను స్రవంతి రవికిషోర్ అసోసియేట్ నిర్మాతగా వ్యవహరించి సినిమా నిర్మించాక తన వాటా తాను తీసుకున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక నాడు ఎన్నో సంచలన రికార్డులు నమోదు చేసింది. ఆ రోజుల్లోనే దాదాపు రు. 20 కోట్లు వసూలు చేసి సంచలన విజయం సాధించింది. ఈ సినిమా కంటే స్వయంవరం సినిమాతో తమ ప్రతిభ చాటుకున్నారు దర్శకుడు విజయ్ భాస్కర్, రచయిత త్రివిక్రమ్. ఈ సినిమా తర్వాత ఈ జంట కొన్ని సినిమాల వరకు తమ జైత్రయాత్ర కొనసాగించింది.
ఇక బాలనటుడిగా ఉన్న తరుణ్ ఈ సినిమాతో హీరో అవ్వగా అతడికి ఒక్కసారిగా స్టార్ డమ్ వచ్చింది. ఈ సినిమా హీరోయిన్ రిచా కొన్నాళ్ల పాటు హవా కంటిన్యూ చేసింది. ఇక ఈ సినిమాతోనే ప్రముఖ గాయకుడు రామకృష్ణ తనయుడు సాయికిరణ్ వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు కోటి సంగీతం పెద్ద ప్లస్ కాగా.. ఎన్నో కేంద్రాల్లో 200 రోజులు, 300 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.