ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడం కరోనా కారణంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలను వాయిదా వేయడం జరిగాయి. ఎన్నికలను వాయిదా వేయడంతో సీఎం జగన్ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి రమేశ్‌కుమార్‌పై విమర్శలు చేయడంతో పాటు ఆయనపై కుల ముద్ర కూడా వేసి మరీ విమర్శలు చేశారు. ఆయన్ను తప్పించి జస్టిస్ కనగరాజ్‌ను ఎన్నికల అధికారిగా జగన్ ప్రభుత్వం నియమించింది. చివరకు నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లి మరీ ఆయనే ఎన్నికల అధికారిగా తిరిగి పదవిలోకి వచ్చారు.
ఇక ఇప్పటకీ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం లేదు. ఇక కొద్ది రోజులుగా జగన్ ప్రభుత్వానికి కంట్లో నలుసులా మారిన వైసీపీ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు మరోసారి జగన్‌పై ఫైర్ అయ్యారు. జగన్ నిమ్మగడ్డపై కులముద్ర వేసి మరీ ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారని.. వాస్తవానికి ఏపీలో కరోనా వల్లే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయన్నారు.
జగన్ ఎంతో అభిమానించే తెలంగాణ సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుపుతున్నారని.. జగన్ కూడా ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఆయన సూచించారు. ఏపీ సీఎం జగన్‌కు ఉన్న భయం కరోనా కాదు… డరోనా అన్నారు. మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీని భ్రష్టుపట్టిస్తున్నారని కూడా రఘురామ విమర్శించారు.