దేశంలో రోజు రోజుకు మహిళలపై అరాచకాలు అత్యాచారాలు పెరిగి పోతున్నాయి. ఉత్తర భారత్‌లో యూపీ, బిహార్ లాంటి రాష్ట్రాలలో పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా.. ఎంత మందికి శిక్షలు పడుతున్నా కూడా ఈ అత్యాచారాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఓ వైపు ఈ మృగాళ్లకు ఘోరమైన శిక్షలు ఉన్నా కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇటీవలే యూపీలో ఓ దళిత బాలికపై హత్రాస్‌లో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనతో దేశం అంతా అట్టుడుకి పోతోంది.
ఇదిలా ఉంటే తాజాగా బిహార్‌లో మరో దారుణం వెలుగు చూసింది. ఓ మహిళ తన ఐదేళ్ల కుమారుడితో కలిసి బ్యాంక్ పని నిమిత్తం బయలు దేరింది. కొందరు దండుగులు మార్గ మధ్యలో ఆమెను అడ్డగించి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె నోరు మూసేసి ఆ మహిళతో పాటు ఆమె ఐదేళ్ల కుమారుడిని కూడా కట్టేసి నదిలో విసిరేసి వెళ్లిపోయారు.
నదిలో మునిగిపోతూ ఆ మహిళ సాయం కోసం గట్టిగా కేకలు వేసింది. ఆ మహిళ అరుపులు విన్న స్థానికులు ఆమెను, చిన్నారిని బయటకు తీశారు. అయితే అప్పటికే ఆమె ఐదేళ్ల కుమారుడు చనిపోయాడు. తాను బ్యాంకు పని కోసం వెళుతుంటే కొందరు దండుగుల చుట్టుముట్టి తనపై సామూహిక అత్యాచారం చేశారని ఆమె విలపిస్తూ చెప్పింది. పోలీసులు కేసు దర్యాప్తులో ఇప్పటికే ఓ నిందితుడిని అదుపు లోకి తీసుకున్నారు.