దుబ్బాక ఉప ఎన్నిక… టీఆర్ఎస్‌కు అదిరిపోయే షాక్‌

తెలంగాణ‌లో దుబ్బాక ఉప ఎన్నిక నేప‌థ్యంలో రోజు రోజుకు అనేక ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఉప ఎన్నిక నోటిపికేష‌న్ అక్టోబ‌ర్ 9న వెలువ‌డింది. ఇప్ప‌టికే నామినేష‌న్ల ఉప సంహ‌ర‌ణ కూడా పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం బ‌రిలో 23 మంది అభ్య‌ర్థులు పోటీలో ఉన్నారు. ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోన్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ త‌గిలింది. తొగుట మండ‌ల ఎంపీపీ గులాబీ పార్టీని వీడి పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌మక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

 

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ సీటు ఆశించి భంగ‌ప‌డ్డ వారిని మంత్రి హ‌రీష్‌రావు టీఆర్ఎస్‌లో చేర్చుకుని షాక్ ఇస్తే.. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్ర‌జా ప్ర‌తినిధిని కాంగ్రెస్‌లో చేర్చుకుని పెద్ద షాక్ ఇచ్చారు. ఈ ప‌రిణామాలు అధికార పార్టీ నేత‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. తొగుట ఎంపీపీ లత నరేందర్ రెడ్డితో పాటు మండలంలోని కీలక నేతలు చేరారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలని పిలుపునిచ్చారు.