ప్రముఖ కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ తండ్రి రమేశ్ కడవ్లాపై ప్రముఖ కోలీవుడ్ హాస్యనటుడు సూరి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రమేశ్ ప్లాట్ అమ్ముతున్నానంటూ తన వద్ద రు 2.70 కోట్లు తీసుకుని మోసం చేశాడంటూ సూరి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన డబ్బు తనకు తిరిగి చెల్లించమని ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా తన గోడు పట్టించుకోలేదని సూరి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఐదేళ్లుగా తన డబ్బులు తనకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ సూరి వాపోయాడు.
రమేశ్‌తో పాటు ప్రముఖ ఫైనాన్షియర్ అంబువేల్ రాజన్‌కు కూడా ఇందులో ప్రమేయం ఉందని సూరి ఆరోపించాడు. అలాగే తనకు వీర ధీర సూరన్ సినిమాకు ఇవ్వాల్సిన రు. 40 లక్షల రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదని చెప్పాడు. సూరి చేసిన ఫిర్యాదు మేరకు రమేశ్‌తో పాటు అంబువేల్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన హీరో విష్ణు విశాల్ తమ కుటుంబంపై ఉద్దేశ పూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
ఓ ప్రకటన రిలీజ్ చేస్తూ తన కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేయడం చాలా షాకింగ్‌గా, బాధగా ఉందని.. మా కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. దీని వెనక ఏదో దురుద్దేశం ఉందని విశాల్ ఆరోపించారు. నిజానికి సూరీయే 2017లో కవరిమాన్ పరాంబరై సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ తిరిగి చెల్లించాల్సి ఉందన్నాడు. ఇతరులపై నిందలు వేయడం కంటే ముందు తమను తాము పరిశీలన చేసుకోవాలని విశాల్ కౌంటర్ వేశాడు.