రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రజా ప్రతినిధులు, వ్యాపార వేత్తలపై సీబీఐ పంజా విసురుతోంది. తాజాగా ఏపీలోని నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు ఇంట్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచే ఈ సోదాలు జరుగుతున్నాయి. అయితే సీబీఐ అధికారులకు ఎంపీ ఇంట్లో ఏం దొరికాయన్నది మాత్రం తెలియడం లేదు.
ఈ సోదాలు ఇందు, భారత్ కంపెనీతో పాటు మొత్తం 8 కంపెనీలలో జరుగుతున్నాయంటున్నారు. ఈ కంపెనీలపై గతంలో నమోదు అయిన కేసుల ఆధారంగానే ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. ఢిల్లీలో ఉన్న ఎంపీ రఘు నివాసంతో పాటు, ఆయన గెస్ట్‌హౌస్, హైదరాబాద్‌లని గచ్చిబౌలిలో ఉన్న ఆయన నివాసం, ఏపీలో నరసాపురంలో ఉన్న ఆయన నివాసంలో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.
ఇక రఘురామ కృష్ణంరాజు ఏపీలో అధికార పార్టీకి చెందిన ఎంపీ అయ్యి ఉండి కూడా ఆ పార్టీపై ప్రతి రోజు విమర్శలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. అదే సమయంలో ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చనువుగా ఉంటోన్న సంగతి తెలిసిందే.