వైఎస్సార్‌సీపీ కీలక నేత, పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మాజీ ఎమ్మెల్యే కూనపరెడ్డి రాఘవేంద్రరావు (చినబాబు) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన గురువారం మృతి చెందారు. ఆయన మృతితో స్తానిక వైసీపీ కేడర్లోనూ, పెనుగొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. చినబాబు కుటుంబానికి ఘనమైన చరిత్ర ఉంది. వారి కుటుంబం స్వాతంత్య్రోద్యమంలో కూడా పాల్గొంది. ఇక 1999 ఎన్నికల్లో చంద్రబాబు ఆయనకు సీటు ఇవ్వకుండా మల్లుల లక్ష్మీనారాయణకు టిక్కెట్ ఇచ్చారు.
దీంతో చినబాబు పెనుగొండ అసెంబ్లీ నుంచి స్వతంత్య అభ్యర్థిగా చినబాబు గెలిచారు. అనంతరం టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల టైంలో పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం రద్దయ్యింది. దీంతో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలో చేరిన చినబాబు.. 2014లో వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరారు. వైఎస్పార్‌సీపీ ఆచంట నియోజవర్గం కన్వీనర్‌గా చినబాబు పనిచేశారు. అయితే 2014 ఎన్నికల్లో ఆయనకు సీటు వస్తుందనుకున్న టైంలో జగన్ అనూహ్యంగా ముదునూరు ప్రసాదరాజుకు సీటు ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన రాజకీయంగా అంత క్రియాశీలంగా లేరు. ఇక కూనపరెడ్డి మృతిపట్ల ఆచంట ఎమ్మెల్యే, మంత్రి శ్రీరంగనాథరాజు ప్రగాఢ సంతాపం తెలిపారు.