ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే కరోనా దెబ్బతో ఎన్నో దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతే ఎంతో మంది ఈ వైరస్ భారీన పడ్డారు. ఇక లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందారు. కరోనా నుంచి ప్రపంచ ప్రజానీకాన్ని గట్టెక్కించేందుకు ఓ వైపు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరోనా మహమ్మారే చివరి మహమ్మారి కాదని.. ఇలాంటి వైరస్‌లు, మహమ్మారులు భవిష్యత్తులో మరిన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. స్పానిష్ ఫ్లూ, సార్స్, మెర్స్, ఎబోలా, స్వైన్ ఫ్లూ వంటి ఎన్నో వైరస్‌లు విజృంభిస్తూ ఎప్పటికప్పుడు మానవాళికి సవాల్ విసురుతున్నాయని.. కేవలం కరోనా వైరస్తోనే ప్రమాదం ఇప్పుడు రాలేదని అన్నారు. ఇక భవిష్యత్తులోనూ మరన్నె వైరస్‌లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
ఇక WHO కరోనా వ్యాక్సిన్ అన్ని దేశాలకు సమానంగా అందేందుకు కొవ్యాక్స్ వైరస్ కార్యక్రమం చేపట్టిందని చెప్పింది. ఇక టీకా తయారు చేసుకోలేని.. కొనలేని 100 దిగువ, మధ్యతరగతి దేశాలకు సైతం తాము వ్యాక్సిన్ అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని స్పష్టం చేసింది.