అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. పలు సర్వేలు జో బైడెన్ ముందున్నట్టు స్పష్టం చేయడంతో ట్రంప్ కాస్త అసహనంతో ఉన్నట్టే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌పై ట్రంప్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కమలాను అమెరికా ప్రజలు ఇష్టపడబోరని కూడా ఆయన చెప్పారు. ఆమె అమెరికా ప్రెసిడెంట్ అయితే అది అమెరికాకే ఘోర అవమానం అని కూడా విమర్శించారు.
కమలా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నా జో బైడెన్ ఆమెను ఉపాధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇక తాను ప్రపంచ గొప్ప ఆర్థిక వ్యవస్థగా అమెరికాను నిర్మించానని చెప్పుకున్న ట్రంప్ చైనా కరోనా వైరస్ వల్లే తమ ఆర్థిక వ్యవస్థకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. ఈ క్రమంలోనే ఆయన జో బైడెన్ దూకుడు నేపథ్యంలో చివరకు సెంటిమెంట్ అస్త్రం వాడుకున్నారు. జో బైడెన్ గెలిస్తే చైనా గెలిచినట్టేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం చైనా పట్ల అమెరికా ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సెంటిమెంట్ అస్త్రం వాడడం ద్వారా తనపై ఉన్న వ్యతిరేకతను కొంత వరకు అయినా తగ్గించుకోవాలని ట్రంప్ ఈ రెచ్చగొట్టే అస్త్రం వాడుతున్నట్టు తెలుస్తోంది. ఇక బైడెన్ పాలసీలన్ని చైనాకు అనుకూలంగా ఉంటాయని.. అందుకే అమెరికా శత్రువులు అందరూ ఆయనే గెలవాలని కోరుకుంటున్నారని కూడ ట్రంప్ విమర్శించారు.