టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి 2003లో దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. ఈ రోజు ఇండస్ట్రీని శాసించే వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. డిస్ట్రిబ్యూషన్, నిర్మాతగా, ఎగ్జిబిటర్, థియేటర్ల సిండికేట్‌లో ఒక కీలక వ్యక్తిగా ఆయన చక్రం తిప్పుతారన్న టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. రాజు ప్లానింగ్ మామూలుగా ఉండదు. కొన్ని సంవత్సరాలుగా ఆయన హవా నడుస్తోంది. పెద్ద హీరోలు, దర్శకులతో క్రేజీ కాంబినేషన్లు సెట్ చేయడం ఆయనకే చెల్లింది.
బడా బడా ప్రాజెక్టులను మంచి నీళ్లు తాగినంత సులువుగా సెట్ చేసి పడేస్తారు. అయితే ఇప్పుడు యువ నిర్మాతలు, ఎన్నారైల ఎంట్రీతో ఆయనకు చెక్ పెడుతున్నారట. ఆయన హవా తగ్గుతోందని అంటున్నారు. యూవీ, మైత్రీ, ఏకే ఎంటర్టైన్‌మెంట్, సితార వాళ్లతో పాటు కొందరు ఎన్నారైలు దర్శకులు, హీరోలతో ముందుగా అప్రోచ్ అవ్వడంతో పాటు అడ్వాన్స్‌లు ఇచ్చేస్తున్నారు. పెద్ద పెద్ద హీరోలకు భారీ అడ్వాన్స్‌లతో ఖాల్షీట్లు తీసుకుంటున్నారు. దీంతో రాజు రేసులో వెనకపడుతున్నారు.
పైగా ఆయన దగ్గర అడ్వాన్స్‌ల వ్యవహారాలు ఉండవు. ఇక ఇప్పుడు హీరోలు నిర్మాతలు అవుతున్నారు. వారికి లాభాల్లో వాటా కావాలంటున్నారు. ఇవి రాజు దగ్గర కుదరవు. అందుకే బడా ప్రాజెక్టులు ఇప్పుడు ఆయనకు దగ్గరకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం నిర్మాతల సిండికేట్ స్టార్ట్ చేసిన ఆయన మంచి ప్రాజెక్టు తెస్తే తాను ఫండిగ్ చేసి, రిలీజ్ చేస్తానని చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ నిర్మాతలు ఎవరి సినిమాలు వారు చేసుకుంటున్నారే తప్పా రాజును పట్టించుకోలేదు.
ఇక డిస్ట్రిబ్యూషన్లోనూ లక్ష్మణ్ నైజాంలో పోటీగా ఉన్నాడు. ఇక కొందరు నిర్మాతలు థియేటర్ల సిండికేట్ వల్ల దిల్ రాజుకు ఇవ్వడంతో నష్టపోతున్నామన్న భావనతో ఉన్నారు. దీంతో వారు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. ఏదేమైనా రాజుకు టాలీవుడ్‌లో పలువురు రకరకాల యాంగిల్స్‌లో చెక్ పెట్టడం అయితే ఖాయం అంటున్నారు.