టాలీవుడ్‌లో కీర్తిరెడ్డి చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ ముద్ర వేసుకుంది. పవన్ కళ్యాణ్ సరసన ఆమె నటించిన తొలిప్రేమ సినిమా ఇప్పటకీ బుల్లితెరపై వస్తుంటే ప్రేక్షకులు ఎంత మైమరచిపోయి ఆ సినిమాలో లీనమవుతారో చెప్పక్కర్లేదు. తొలిప్రేమ తర్వాత ఆమెకు స్టార్ హీరోల పక్కన అవకాశాలు రాలేదు. నాగార్జున రావోయి చందమామ సినిమాలో మాత్రమే ఆమె రెండో హీరోయిన్‌గా నటించింది.
తొలిప్రేమ తర్వాత కీర్తిరెడ్డికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తర్వాత మహేష్‌బాబు అర్జున్ సినిమాలో ఆమె మహేష్‌కు సోదరిగా నటించింది. ఆ తర్వాత కీర్తిరెడ్డి అక్కినేని మేనళ్లుడు సుమంత్‌ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన యేడాదిలోపే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు ఇంత త్వరగా ఎందుకు విడిపోయారు ? అన్నది ఇండస్ట్రీలో చాలా మందికి అంతుపట్టలేదు.
వీరి మధ్య గ్యాప్ రావడానికి కారణం.. సుమంత్‌ను కీర్తి అమెరికాలో సెటిల్ అవుదాం.. అక్కడకు వచ్చేయమని కోరగా… సుమంత్ మాత్రం తాను తమ కుటుంబానికి ఉన్న ఇమేజ్, సినిమాలను వదిలి అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ఎంత మాత్రం ఒప్పుకోలేదట. కీర్తిరెడ్డి ఫ్యామిలీ ఆర్థికంగా ఉన్నవాళ్లు. దీంతో ఆమె అమెరికాలో బిజినెస్ చేసి అక్కడే సెటిల్ అవుదామనుకున్నా సుమంత్ ఒప్పుకోలేదు. ఈ విషయంలో వీరి మధ్య గ్యాప్ రావడంతో విడిపోయారు. ఆ తర్వాత కీర్తి ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. కీర్తి దంపతులకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు.