కొన్ని సంవత్సరాలుగా రెవెన్యూ చట్టంలో బూజుపట్టి పోయి ఉన్న రూల్స్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ కూకటి వేళ్లతో సహా పెకలించి వేశారు. తెలంగాణ శాసనసభలో ప్రవేశ పెట్టిన కొత్త రెవెన్యూ బిల్లు ప్రకారం పాస్ పుస్తకాల చట్టం – 2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు చట్టం – 2020 పొందుపరిచారు. అయితే కేంద్ర, రాష్ట్రాల భూములకు మాత్రం చట్టంలోని అంశాలు వర్తించవు అని ప్రభుత్వం చెప్పింది. ఇక భూ లావాదేవీలకు సంబంధించి ఏ పని ఉన్నా వెబ్‌సైట్ స్లాట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన సమయానికి పత్రాలు ఇచ్చి సేవలు పొందాలని… భూములను మార్ట్ గేజ్ చేస్తే ధరణి వెబ్ సైట్‌లో నమోదు చేయాలి. భూ రికార్డుల నిర్వహణ అంతా పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలోనే ఉంటుంది. భూమి హక్కు పత్రం, పట్టాదారు పాస్ పుస్తకం ఏకీకృతం చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. భూ హక్కుల రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు ఉంటాయని… ధరణి పోర్టల్ లో ఆన్ లైన్ ద్వారా మాత్రమే భూ యాజమాన్య హక్కుల బదిలీ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
పోర్టల్లో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ లాండ్ వివరాలు ఉంటాయి. ఈ చట్టం ప్రకారం ఏ అధికారికి విచక్షణాధికారాలు ఉండవు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యూటేషన్ ఉంటుంది. మ్యూటేషన్ పవర్‌ను కూడా ఆర్డీవో నుంచి తొలగించి ఎమ్మార్వోకు అప్పగించారు. ల్యాండ్ మ్యూటేషన్ అయిన వెంటనే ధరణిలో అప్‌లోడ్ కావాలి. ఇక ఈ చట్టం ప్రకారం తహసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్లు. వీరికి కేవలం వ్యవసాయ భూములే రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఉంది. రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేష్లన్లు జరుగుతాయి. గ్రామకంఠం, పట్టణ భూములను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. ఏదేమైనా ఈ చట్టం వల్ల అవినీతికి చాలా వరకు అస్కారం తగ్గుతుందనే చెప్పాలి.