ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు ( చోటా కె.నాయుడు సోదరుడు) తనను వాడుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని నటి శ్రీ సుధ కొద్ది రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. ఇక శ్రీ సుధ అప్పట్లో ఎస్ ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఫిర్యాదు స్వీకరించేందుకు ఎస్సార్‌నగర్ మాజీ ఇన్స్పెక్టర్ మురళీ కృష్ణ తన దగ్గర నుంచి కొంత లంచం తీసుకున్నాడని శ్రీ సుధ ఏసీబీకి ఫిర్యాదు చేసింది.
ఈ కేసు దర్యాప్తు కోసం మురళీ కృష్ణ తన నుంచి డబ్బులు వసూలు చేశాడని ఆమె గతంలోనే ఆరోపించింది. అలాగే ఈ కేసులో శ్యామ్ కె. నాయుడును అరెస్టు చేయకపోవడంతో పాటు తాను కోర్టులో రాజీ కుదుర్చుకున్నట్టు నకిలీ లెటర్ కూడా తయారు చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐతో మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్స్ కూడా ఆమె ఏసీబీకి అందజేశారు. సీఐ మురళి కృష్ణ పై కేస్ నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు.