దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హవా నడుస్తోన్న టైంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీల సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీని స్తాపించారు. నాడు బలమైన ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని సవాల్ చేసి మరీ పార్టీని స్తాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు పుట్టిన పార్టీ అంటూ నాడు ఎన్టీఆర్ ప్రజల్లోకి బలంగా తెలుగువారి ఆత్మగౌరవం నినాదం బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాడు.
నాడు ఎన్టీఆర్ అనే మర్రిచెట్టు నీడలో ఎదిగిన వారే నేడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఎన్టీఆర్ టీడీపీ నుంచే రాజకీయ జీవితం ఆరంభించారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచే సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అధిరోహించారు. చంద్రబాబు సీఎం అయ్యాక కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు. తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ పెట్టారు.
ఇక ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని కేసీఆర్ అనేక సందర్భాల్లో చాటుకున్నారని టీడీపీ నేతలు అంటుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలో పదో తరగతి పాఠ్యాంశంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను చేర్చారు. ఈ సంవత్సరం కొత్తగా రూపొందించిన పదో తరగతి సిలబస్‌లో సాంఘీకశాస్త్రం 268వ పేజీలో ఎన్టీఆర్ జీవిత విశేషాలను పొందు పరిచారు. ఢిల్లీ పెద్దలు నచ్చక చేస్తోన్న పనులపై ఎన్టీఆర్ ఎలా తిరుగుబాటు చేశారు. తక్కువ కాలంలోనే పార్టీ పెట్టి ఎలా ముఖ్యమంత్రి అయ్యారో ఇందులో వివరించారు.
ఎన్టీఆర్ హయాంలో తీసుకొచ్చిన రూ.2కే కిలో బియ్యం మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలను పొందుపరిచారు. ఈ క్రమంలోనే కేసీఆర్ నిర్ణయంపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసీఆర్ తన రాజకీయ గురువును బాగా గుర్తుంచుకున్నారన్న ప్రశంసలు కూడా ఆయనకు వస్తున్నాయి.