తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే. వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిలు తెలివిగా తమ పదవులు పోకుండా టీడీపీకి గుడ్‌బై చెప్పి, వైసీపీ కండువా కప్పుకోకుండా జగన్‌కు జై కొట్టారు. ఇక ఎన్నికల తర్వాత పదుల సంఖ్యలో టీడీపీ నేతలు సైతం వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక పైన పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేల బాటలోనే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు నడుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు. కాకపోతే ఆ మధ్య పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లు టీడీపీని వీడతారని ప్రచారం జరిగింది.
జగన్ వీలున్నంత మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీకి దూరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ టార్గెట్, పరుచూరు, రేపల్లెపై పడింది. అందుకే కొద్ది రోజులుగా ఈ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌లను పార్టీలో చేర్చుకునేందుకు జగన్ మీడియేటర్ల ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేయించారన్న ప్రచారం ఉంది. అయితే వీరు పార్టీ మారే ప్రసక్తిలేదని తేల్చి చెప్పేసి, టీడీపీలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. నిజానికి వీరి ఇద్దరినీ వైసీపీలోకి తీసుకురావడానికి మంత్రులు, కీలక నేతలు బాగానే లాబీయింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వీరిని తీసుకుంటే రేపల్లె, పరుచూరు నియోజకవర్గాల్లో వైసీపీకి తిరుగుండదని భావించారు.
కానీ ఈ ఇద్దరు నేతలు టీడీపీలోనే ఉంటామని, చంద్రబాబుకు సపోర్ట్‌గా ఉంటామని చెప్పి దూకుడుగా పనిచేసుకుంటున్నారు. ఇక వీరు టీడీపీలో యాక్టివ్ కావడం వల్ల పర్చూరు, రేపల్లె నియోజకవర్గాల్లో వైసీపీకి పెద్ద సీన్ లేకుండా పోయింది. వైసీపీ అధికారంలో ఉన్నా సరే ఈ నియోజకవర్గాల్లో టీడీపీదే డామినేషన్. అసలు ఏలూరి, అనగానిల బలం ఏ మాత్రం తగ్గలేదు. పైగా ఈ నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు వీక్‌గా ఉన్నారు. పర్చూరులో రావి రామనాథం బాబు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సరే పెద్ద ఉపయోగం లేకుండాపోయింది. మొన్నటి ఎన్నికల్లో ఏకంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఓడించిన ఏలూరిపై ఎవరిని పోటీగా ఏ నాయకుడిని పెట్టాలో కూడా తెలియక వైసీపీ అధిష్టానం సతమతమవుతోంది.
ఏలూరి ముందు ఆయన బలం సరిపోవడం లేదు. అందుకే ఇప్పటికీ పర్చూరులో వైసీపీ పుంజుకోలేకపోతుంది. అటు రేపల్లెలో మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభకు వెళ్లడంతో, నియోజకవర్గంలో అనగానికి తిరుగులేకుండా పోయింది. ఇక్కడ మోపిదేవి సోదరుడు హరనాథ్ బాబు ఉన్నా సరే వైసీపీకి పెద్ద స్కోప్ లేకుండా పోతుంది. ఇంకా రేపల్లె టీడీపీని కదపలేకపోతున్నారు. మొత్తానికైతే ఏలూరి, అనగానిలు వైసీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా దూసుకెళుతున్నారు.