సద్దాం హుస్సేన్ ఇరాక్‌ను 1979 నుంచి 2003 వరకు పాలించిన ఓ నియంత. చివరకు అగ్రరాజ్యం అమెరికా సేనలకు చిక్కి 2006 డిసెంబర్ 30న ఉరికంభం ఎక్కి ప్రాణాలు కోల్పోయాడు. ప్రపంచాన్నే వణికించిన ఈ నియంతలో రొమాంటిక్ కోణం కూడా ఉంది. మనోడు అనేక నవలలు రాసినా అందులో ఓ రొమాంటిక్ నవల ‘జబీబా అండ్ ది కింగ్’. ఇరాక్ చరిత్రను, దేశంలో జరిగిన సంఘటనలకు ప్రతీకగా నిలిచింది. ఈ నవలలో కథ చూస్తే ఇది ఇరాక్ రాజధాని బాగ్దాద్ కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న టిక్రిట్ పట్టణం (సద్దాం స్వస్థలం) నేపథ్యంలో 7-8 శతాబ్ద కాలంలో జరిగినట్లుగా ఉంటుంది.
ఇదో రొమాంటిక్ లవ్‌స్టోరీ. ఇందులో ముఖ్యపాత్ర జబీబా అనే అమ్మాయికి పెళ్లవుతుంది. క్రూరుడైన ఆమె భర్త ఆమెను నిత్యం చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. ఆమెకు ఇష్టం లేకుండానే బలవంతంగా అత్యాచారం చేస్తాడు. అదే సమయంలో ఇరాక్ రాజు ఆమెను గాఢంగా ప్రేమిస్తాడు. చివరకు జబీబాను హింసించిన వారిపై రివేంజ్ తీర్చుకున్న చక్రవర్తి అతడు కూడా మరణిస్తాడు. 2000లో సద్దాం ఈ నవల రాశాడు.
అయితే నరేషన్ అంతా 7-8 శతాబ్దాంలో జరిగినట్టు ఉండడం విశేషం. ఈ నవలలో జబీబా అనే పాత్రను ఇరాక్ ప్రజలుగా, క్రూరమైన భర్తగా అమెరికాను అభివర్ణించాడు. తనను ఇరాక్ రాజుగా చెప్పుకున్నాడు. నవలలో జబీబాపై ఆమె భర్త అఘాయిత్యాన్ని.. 1991 జనవరి 17న ఇరాక్‌పై అమెరికా సైన్యం దాడి చేయడంతో పోల్చాడు. ఈ నవలను సద్దాం అరబిక్‌లో రాయగా.. 2004లో ఆంగ్లంలోకి తర్జుమా చేసి ప్రచురించారు. ఏదేమైనా ఇంత క్రూరమైన నియంత సద్దాంలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉండడం ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆశ్చర్య పరిచింది.