దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఆర్జేడీ విజయం సాధించకపోతే ఆ పార్టీకి భవిష్యత్తు లేదన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కీలక పరిస్థితుల్లో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. ఆ పార్టీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ రాజీనామా చేశారు. గురువారం ఆయన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు పంపారు. రఘువంశ్ ప్రసాద్ పార్టీలో కీలక నేత.
ఆయన పార్టీకి రాజీనామా చేసేందుకు కారణాలు వెల్లడించకపోయినా ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్‌తో ఆయనకు ఉన్న విభేదాల కారణంగానే పార్టీ నుంచి వైదొలిగనట్లు తెలుస్తోంది. ఇక రఘువంశ్ ప్రసాద్ త్వరోనే ఆర్జేడీకి మరో షాక్ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారట. ఆయన ఎన్టీయే కూటమిలో చేరే అవకాశాలు ఉన్నట్టు బిహార్ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రఘువంశ్ ప్రసాద్ గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్జేడీలో లాలూ ప్రసాద్ యాదవ్ తరువాత అత్యంత సీనియర్ నేతగా, పార్టీ ఉపాధ్యక్షుడిగా గుర్తింపుపొందారు. కాగా ఈ ఏడాది చివరలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే