సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు కాదేది సినిమాకు అనర్హం అన్నట్టుగా ఉంది. సమాజంలో జరిగిన సంఘటనలు, రాజకీయాలు, క్రైం అన్ని కూడా రాంగోపాల్ వర్మకు సినిమా కథలు అయిపోయాయి. ఈ క్రమంలోనే గతేడాది హైదరాబాద్లో హత్యకు గురైన దిశ, ఆ తర్వాత ఆమెను కిరాతకంగా చంపేసిన కీచకులను ఎన్కౌంటర్ చేసిన అంశం నేపథ్యంలో సినిమా తెరకెక్కించేందుకు వర్మ రెడీ అవుతున్నారు. గతంలోనే దిశ నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో సినిమా తీస్తానని ప్రకటించినట్టుగానే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
ఇందులో ఓ యువతి స్కూటీతో పాటు, నిందితుడు పారిపోతూ ఉండటం, వారిని ఎన్కౌంటర్ చేసేందుకు ఓ తుపాకీ గురి పెట్టి ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక దిశను హత్య చేసేముందు ఓ లారీ వాడారని కూడా తెలిసిందే. పోస్టర్లో వర్మ ఓ లారీ కూడా ఉంచాడు. ఈ సినిమాను అనురాగ్ కాసర్ల నిర్మిస్తున్నారు. ఇక దిశ హత్య విషయానికి వస్తే గతేడాది నవంబర్ 26న నలుగురు నిందితులు ఓ యువతిని లక్ష్యంగా చేసుకుని అత్యాచారం చేసి ఆమెను చంపేసి ఆ బాడీకి నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే.
ఇక ఆ తర్వాత వర్మ ఈ నలుగురు నిందితుల్లో ఒకరు అయిన చెన్నకేశవులు భార్యను కలిశారు. అదేవిధంగా శంషాబాద్ పోలీసులను కూడా కలిసి సినిమా కంప్లీట్ చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 26న, నవంబర్ 26న సినిమా రిలీజ్ కానున్నాయి. ఏదేమైనా ఫస్ట్ లుక్పోస్టర్తోనే వర్మ కథేంటో చెప్పి పెద్ద సంచలనం రేపాడు.